Woman hit by bull: తమిళనాడులో ఆదివారం నిర్వహించిన జల్లికట్టు పోటీల్లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ ఎద్దు పరిగెత్తుకుంటూ వెళ్లి.. బైక్ మీద కూర్చున్న మహిళను ఢీకొట్టింది. ఆ దృశ్యాలు స్థానికుల కెమెరాలకు చిక్కాయి.
ఇదీ జరిగింది..
తిరువన్నమలై జిల్లా కన్నమంగళంలో ఆదివారం వార్షిక జల్లికట్టు ఉత్సవాలు జరిగాయి. జిల్లా యంత్రాంగం.. పోటీలకు అనుమతులు ఇవ్వకపోయినా.. నిబంధనలను ఉల్లంఘించి స్థానికులు ఉత్సవాలు జరుపుకున్నారు.
పోటీల్లో పాల్గొనేందుకు వెల్లూరు, రాణిపెట్టై, కంచి పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది అక్కడికి వెళ్లారు. ఓ ఎద్దు రంకెలేసుకుంటూ ప్రజలపైకి దూసుకెళ్లింది. ఆ ఎద్దును అదుపు చేసేందుకు కొందరు విఫలయత్నం చేశారు. అదే సమయంలో ఓ ద్విచక్రవాహనం అటువైపు వెళ్లింది. బైక్ వెనుక కూర్చున్న మహిళను.. ఆ ఎద్దు బలంగా ఢీకొట్టింది. ఆ మహిళ బైక్ మీద నుంచి ఎగిరిపడింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ.. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిబంధనలు పట్టించుకోకుండా పోటీలు నిర్వహించడంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి:- బుల్ ఫెస్టివల్లో ఎద్దుల వీరంగం.. ప్రేక్షకులపైకి దూసుకెళ్లి..