తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తన ఆస్తుల విలువను వెల్లడించారు. తన పేరు మీద మొత్తం రూ.47 లక్షల విలువైన నికర చరాస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు. స్థిరాస్తులేవీ లేవని స్పష్టం చేశారు. అయితే ఓ వ్యక్తికి రూ.15 లక్షలు అప్పు చెల్లించాల్సి ఉందని తెలిపారు.
పళనిస్వామి భార్య పేరు మీద ఎంతంటే?
తన భార్యకు రూ.1.04కోట్ల చరాస్తి ఉన్నట్లు తెలిపారు. అందులో రూ.50.21 లక్షలు హిందూ అవిభక్త కుటుంబం (హెచ్‌యూఎఫ్)కు చెందినవి అని పేర్కొన్నారు. రూ.1.78కోట్ల స్థిరాస్తి తన భార్య పేరు మీద ఉందని తెలిపారు. హెచ్‌యూఎఫ్ కింద రూ.2.10 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. తన పూర్వీకుల ఆస్తితో సహా ప్రకటించారు.
ఆదాయపు పన్ను, జీఎస్టీ రంగాలతో సహా ప్రభుత్వానికి ఎటువంటి బకాయిలు లేవని ప్రకటించిన ఆయన.. అఫిడవిట్లో వ్యవసాయాన్ని తన వృత్తిగా పేర్కొన్నారు.
2016 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పళనిస్వామి చరాస్తి రూ. 12.83 లక్షలుగా ఉండేది. రూ.1.97 కోట్లు విలువైన స్థిరాస్తులు ఉన్నాయి.
గత నాలుగు దఫాలుగా గెలిపొందిన ఎడప్పాడి నియోజవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు తెలిపిన పళనిస్వామి.. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్లో లేవని అఫిడవిట్లో పేర్కొన్నారు.
స్టాలిన్ ఆస్తులు వివరాలు..
డీఎంకే అధినేత స్టాలిన్ సైతం తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. తనకు రూ.4.94 కోట్ల విలువ చేసే చరాస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచారు. స్థిరాస్తులు రూ. 2.24 కోట్లు ఉన్నట్లు వివరించారు. తన పేరు మీద వాహనం లేదని స్పష్టం చేశారు. తన సతీమణి పేరుమీద రూ. 30 లక్షల52వేల854 చరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం స్టాలిన్ చేతిలో రూ.50వేల నగదు ఉంది.
ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేయబోతున్న స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ఆస్తుల విలువ రూ.21.13 కోట్లు. స్థిరాస్తుల విలువ రూ.6.54 కోట్లు ఉన్నట్లు ఉదయనిధి తన అఫిడవిట్లో వెల్లడించారు.
ఇదీ చూడండి: నామినేషన్ వేసిన పళనిస్వామి, స్టాలిన్