తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి వారం రోజులు కూడా గడవకముందే విషాదం చోటుచేసుకుంది. శ్రీవిల్లిపుత్తూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థి మాధవరావు మరణించారు. గత నెలలో కరోనా వైరస్ బారిన పడిన మాధవరావు.. తాజాగా మళ్లీ ఆ వ్యాధి సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని పార్టీ తమిళనాడు ఇన్‌ఛార్జి సంజయ్ దత్ ట్విటర్ వేదికగా వెల్లడించారు.
"కాంగ్రెస్ నాయకుడు, శ్రీవిల్లిపుత్తూర్ పార్టీ అభ్యర్థి మాధవరావు మరణించడం బాధాకరం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా."
-సంజయ్‌దత్, కాంగ్రెస్ తమిళనాడు ఇన్‌ఛార్జి
తమిళనాడులో 234 స్థానాలకు ఏప్రిల్ 6వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం శ్రీవిల్లిపుత్తూర్‌లో ఒకవేళ మాధవరావు విజయం సాధిస్తే ఉపఎన్నిక నిర్వహించే అవకాశం ఉంటుంది.
ఇదీ చదవండి: 'తరతరాల అవినీతికి కాంగ్రెస్, డీఎంకే నిదర్శనం'