వివిధ కుంభకోణాల్లో సీబీఐ, ఈడీ విచారణను ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ యువజన విభాగం నాయకుడు వినయ్ మిశ్రాను ఆ పార్టీ వెనకేసుకొస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ప్రజల కోసం ఉద్దేశించిన నిధుల దొంగతనానికి పాల్పడిన వారు ఎంతటివారైనా జైలుకు వెళ్లాల్సిందేనన్నారు. ఈ మేరకు పశ్చిమ్ బర్ధమాన్ జిల్లాలోని పాండబేశ్వర్ బహిరంగ సభలో వ్యాఖ్యానించారు.
"మిశ్రా విచారణపై టీఎంసీ భిన్న స్వరాలు వినిపిస్తోంది. మమతా బెనర్జీ ఉండగా తనను ఎవరూ ఏమీ చేయలేరని మిశ్రా వ్యాఖ్యానించారు. అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం బొగ్గు దొంగలను వదిలిపెట్టదు."
-అమిత్ షా
తృణమూల్ కాంగ్రెస్ యువజన ప్రధాన కార్యదర్శి అభిషేక్ మిశ్రా నేతృత్వంలో పశ్చిమ్ బర్ధమాన్ జిల్లా బాగానే ఉందని షా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఈ ప్రాంతంలో కొందరు బొగ్గు దొంగతనానికి ప్రసిద్ధి చెందారని ఎద్దేవా చేశారు.
"ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వినయ్ మిశ్రాను అరెస్టు చేసింది. అంతేగాక మనీలాండరింగ్‌తో పాటు.. బొగ్గు అక్రమ మైనింగ్ కేసులో మిశ్రా సోదరుడు వికాస్‌కు సంబంధం ఉంది. ఇక 2019, 2020ల్లో వచ్చిన బుల్బుల్, అంఫన్ తుపాను బాధిత ప్రజల కోసం ఉద్దేశించిన సహాయ నిధులను సైతం టీఎంసీ గుండాలు దుర్వినియోగం చేశారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారు ఏం కాదులే అని అనుకోకండి. మే 2న భాజపా ప్రభుత్వం ఏర్పడిన తరువాత నేరస్థులందరినీ జైలుకు పంపుతాం."
-అమిత్ షా
ఇవీ చదవండి: బంగాల్లో భాజపా కార్యాలయంపై బాంబు దాడి