బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో(abhishek banerjee tmc) ఈడీ విచారణ కోసం హాజరయ్యారు టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ. ఈడీకి పూర్తిగా సహకరిస్తానని అన్నారు. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఉరి వేసుకుంటా..!
బంగాల్‌లో బొగ్గు కుంభకోణానికి సంబంధించి నమోదైన ఓ మనీ లాండరింగ్ కేసులో సెప్టెంబర్ 6న విచారణకు హాజరు కావాలంటూ అభిషేక్ బెనర్జీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చింది. దీనిపై స్పందించిన అభిషేక్ బెనర్జీ.. తనపై వస్తోన్న అవినీతి ఆరోపణలు నిజమని తేలితే బహిరంగంగానే ఉరి వేసుకుంటానని పేర్కొన్నారు. బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం చెందిన భారతీయ జనతా పార్టీ.. రాజకీయంగా తృణమూల్ కాంగ్రెస్‌ను ఎదుర్కోలేకే ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాలకు కేంద్ర సంస్థలను ఉపయోగించుకోవడం తప్ప భాజపాకు మరో పని లేదని విరుచుకుపడ్డారు.
నవంబర్‌లో సీబీఐ కేసు
గతేడాది నవంబర్‌లో సీబీఐ ఈ కేసు నమోదు చేసింది. మాంఝీ అలియాస్ లాలా, ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్ లి. జనరల్ మేనేజర్ అమిత్ కుమార్ ధార్, కాజోర్ ఏరియా మేనేజర్ జయేశ్ చంద్ర రాయ్, ఈసీఎల్ చీఫ్ ఆఫ్ సెక్యూరిటీ తన్మయ్ దాస్, కాజోర్ ఏరియా సెక్యూరిటీ ఇంఛార్జ్ దేబాషిశ్ ముఖర్జీని ఈ కేసులో నిందితులుగా చేర్చింది. మాంఝీ లాలాపై.. అక్రమ మైనింగ్‌కు పాల్పడటం సహా, కునుస్టోరియా, కాజోరా ప్రాంతాల్లో ఈసీఎల్ లీజుకు తీసుకున్న మైన్ల నుంచి బొగ్గును చోరీ చేశారన్న అభియోగాలను మోపింది. కాగా, ఈ అక్రమ వ్యాపారం నుంచి అభిషేక్ బెనర్జీ ఆర్థిక ప్రయోజనం పొందారన్నది ఈడీ వాదన. దీన్ని అభిషేక్ ఖండిస్తున్నారు.
ఎన్నికల ముందు..
బంగాల్‌లో జంగీపుర్, సంసీర్గంజ్, భవానీపుర్‌లో (bhabanipur election) సెప్టెంబరు 30న ఉపఎన్నికలను నిర్వహించనున్నట్లు ఈసీ శనివారం ప్రకటించింది. భవానీపుర్ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికలకు అభ్యర్థిగా సీఎం మమతా బెనర్జీ (mamata banerjee news) పేరును ప్రకటించింది తృణమూల్ కాంగ్రెస్. ఈ ఉపఎన్నిక తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి కీలకం. సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మమత.. ఇందులో గెలిస్తేనే ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రిగా పనిచేసే వారు ఆ పదవి చేపట్టిన ఆరు నెలల్లోగా అసెంబ్లీకి ఎన్నికవ్వాల్సి ఉండటం ఇందుకు కారణం. ఈ ఎన్నికల ముందు బొగ్గు కుంభకోణం కేసు తెరమీదికి రావడం గమనార్హం.
మమత ఫైర్
అభిషేక్‌కు ఈడీ సమన్లపై టీఎంసీ అధినేత్రి, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(mamata banerjee news) తీవ్రంగా స్పందించారు. "కేంద్రం మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక దర్యాప్తు సంస్థలను వాడుకుంటోంది. బొగ్గు మాఫియాతో కుమ్మక్కయింది భాజపా మంత్రులే. బంగాల్ ఎన్నికల సమయంలో బొగ్గు మాఫియాకు సంబంధించిన వ్యక్తుల హోటళ్లలోనే భాజపా మంత్రులు బస చేశారు. మీరు మాపైకి ఈడీని పంపిస్తే.. భాజపా నేతలకు వ్యతిరేకంగా మేము సాక్ష్యాలు పంపిస్తాం. ఇలాంటి కక్షసాధింపు ప్రభుత్వాన్ని నా రాజకీయంలో ఎన్నడూ చూడలేదు" అని ఇటీవల మండిపడ్డారు మమత.
ఇవీ చదవండి:
Mamata banerjee news: భవానీపుర్ అభ్యర్థిగా మమతా బెనర్జీ