ఐఏఎస్ టాపర్స్ జంట టీనా దాబి, అధర్ ఆమిర్ ఖాన్ విడిపోయారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో గల ఫ్యామిలీ కోర్టు వీరికి తాజాగా విడాకులు మంజూరు చేసింది. ఐఏఎస్ పరీక్షలో ఒకటి, రెండు ర్యాంకులు సాధించిన వీరిద్దరూ 2018లో వివాహబంధంతో ఒక్కటై వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అయితే రెండేళ్లకే వీరిమధ్య మనస్పర్ధలు రావడంతో పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో గతేడాది నవంబరులో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా.. ఇప్పుడు విడాకులు మంజూరయ్యాయి.
2015లో నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో టీనా దాబి మొదటి ర్యాంకు సాధించగా.. అధర్ రెండో ర్యాంకులో నిలిచారు. అనంతరం శిక్షణ సమయంలో వీరి మధ్య పరిచయం ప్రేమకు దారితీసింది. అలా 2018లో ఏప్రిల్‌లో వీరు పెళ్లిచేసుకున్నారు. వీరిది మతాంతర వివాహం కావడంతో అప్పట్లో ఆ వేడుక అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ జంట పెళ్లికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అప్పటి కేంద్రమంత్రులు, లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహజన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.
తొలుత టీనా, అధర్ రాజస్థాన్ క్యాడర్‌లో జైపూర్‌లోనే విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం టీనా అక్కడే ఉండగా.. అధర్ మాత్రం డెప్యుటేషన్‌పై తన సొంతరాష్ట్రమైన జమ్మూకశ్మీర్ వెళ్లి శ్రీనగర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. టీనాది మధ్యప్రదేశ్‌లోని భోపాల్. సివిల్స్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచిన తొలి దళిత మహిళగా ఆమె పేరు అప్పట్లో మార్మోగింది.
ఇదీ చదవండి:ఈ బుడ్డోడు.. 427 గ్రామాలకు పెదరాయుడు!