టైమ్స్ గ్రూప్ ఛైర్‌పర్సన్ ఇందూ జైన్ (84) గురువారం రాత్రి దిల్లీలో కన్నుమూశారు. కొవిడ్ సంబంధ ఇబ్బందులతో ఆమె మృతిచెందారు.
"జైన్.. కళలు, ఆధ్యాత్మికత పట్ల మక్కువ చూపేవారని, ఎంతో ఉదారతతో దాతృత్వ కార్యక్రమాలు చేపట్టేవారని, మహిళల హక్కుల కోసం కృషి చేశారు" అని టైమ్స్ నౌ ట్వీట్ చేసింది.
1999లో టైమ్స్ గ్రూప్ ఛైర్‌పర్సన్ బాధ్యతలను చేపట్టిన తర్వాత సంస్థ పురోభివృద్ధికి ఆమె కృషి చేశారని పేర్కొంది. విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకునేందుకు టైమ్స్ రిలీఫ్ ఫండ్‌ను ఆమె స్థాపించారు. 1983లో స్థాపించిన ఫిక్కీ మహిళా విభాగానికి వ్యవస్థాపక అధ్యక్షురాలిగా సేవలు అందించారు. భారతీయ భాషలను ప్రోత్సహించేందుకు తన మామ సాహు శాంతి ప్రసాద్ జైన్ 1944లో స్థాపించిన భారతీయ జ్ఞానపీఠ్ ట్రస్టుకు 1999లో ఆమె ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. 2016లో 'పద్మభూషణ్' అందుకున్నారు.
మోదీ సంతాపం
జైన్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె.. సమాజ సేవా కార్యక్రమాలు, దేశ పురోగతి పట్ల అభిరుచి, సంస్కృతిపై అపారమైన ఆసక్తి చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: '18 ఏళ్లు నిండితే వ్యాక్సిన్'..అని కేంద్రం చెప్పినా..!