ప్రజాప్రతినిధులపై అనర్హత వేటుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అనర్హత పిటిషన్లను సకాలంలో పరిష్కరించే చట్టాన్ని రూపొందించే హక్కు పార్లమెంటు మాత్రమే ఉందని స్పష్టం చేసింది. అదే సమయంలో రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం స్పీకర్ లేదా చట్టసభ ఛైర్మన్ అనర్హత పిటిషన్లను సకాలంలో పరిష్కరించడానికి చట్టాన్ని రూపొందించాలని సుప్రీంకోర్టు పార్లమెంటును కోరింది.
ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్లకు మార్గదర్శకాలు జారీ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత రంజిత్ ముఖర్జీ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. 'అనర్హతకు సంబంధించిన చట్టాన్ని మేము ఎలా రూపొందించగలం? అది పార్లమెంటు పరిధిలోని అంశం' అని పేర్కొంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హృషికేశ్ రాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
అభిప్రాయం సుస్పష్టం..
ఫిరాయింపులు, అనర్హత పిటిషన్లపై విచారణ జరిపే అధికారం స్పీకర్లకే ఉందని, అయితే.. పదో షెడ్యూల్ ప్రకారం సకాలంలో నిర్ణయాలు తీసుకోవట్లేదని రంజిత్ ముఖర్జీ తరఫు న్యాయవాది అభిషేక్ జెబరాజ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిర్ణీత కాలవ్యవధిలో వీటిని పరిష్కరించేలా ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై స్పందించిన జస్టిస్ ఎన్వీ రమణ..'కర్ణాటక ఎమ్మెల్యే అనర్హత కేసులో ఇప్పటికే నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను కదా' అని వ్యాఖ్యానించారు. ఫిరాయింపులపై సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అప్పట్లో తన వాదనలను లేవనెత్తారని సీజేఐ గుర్తుచేశారు. అయితే.. ఆ నిర్ణయాన్ని పార్లమెంటుకే వదిలేసినట్లు తెలిపారు.
'కర్ణాటక ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంలో సుప్రీంకోర్టు తీర్పును చదివారా?' అని ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించగా.. తాను చదవలేదని కోర్టుకు తెలిపారు. అయితే తీర్పు చదివి రావాలని కోర్టు సూచించింది. ఈ అంశంపై రెండు వారాల అనంతరం విచారణ చేపట్టనున్నట్లు పేర్కొంది.
'స్పీకర్‌కు ఆ అధికారం లేదు..'
2019 నవంబర్ 13న ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై విచారణ సందర్భంగా.. ఒక చట్టసభ సభ్యుడిని ఎంత సమయం అనర్హుడుగా ఉండాలి? లేదా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎంతకాలం నిలువరించవచ్చనే అధికారం స్పీకర్‌కు లేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా.. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ఆర్ రమేష్ కుమార్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. అప్పటి అసెంబ్లీలోని ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. అంతేగాకుండా.. 2023 వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించారు. వీరిలో 15 స్థానాలకు ఉప ఎన్నిక జరగాల్సిన ఎమ్మెల్యే అభ్యర్థులూ ఉండటం గమనార్హం. మొత్తంగా 17 మంది శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించడం అప్పట్లో సంచలనంగా మారింది. మొత్తంగా.. స్పీకర్ తీసుకున్న అనర్హత నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించినప్పటికీ.. చట్టసభ సభ్యుడు అనర్హుడుగా ఉన్న సమయంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించొద్దని స్పష్టం చేసింది.
"ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగపరమైన భావనల మధ్య సమతుల్యతను కాపాడే కీలక బాధ్యత స్పీకర్‌దే. రాజ్యాంగ విధులను స్పీకర్ ప్రధాన బాధ్యతగా భావించి నెరవేర్చాలి. వారి రాజకీయ జీవితం ఈ పదవిని ప్రభావితం చేయకూడదు. రాజ్యాంగ విధుల నిర్వహణలో తటస్థంగా ఉండాలి. అయితే.. అందుకు వ్యతిరేకంగా స్పీకర్లు వ్యవహరించే ధోరణి పెరిగిపోతోంది."
-సుప్రీంకోర్టు
ఇక రాజకీయ పార్టీలు సైతం అవినీతి మార్గంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుండటంతో ప్రజామోదంతో ఏర్పడిన ప్రభుత్వాలు నిలకడలేమితో సతమతమవుతున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
"ప్రస్తుత పరిస్థితుల్లో పదో షెడ్యూల్‌ను బలోపేతం చేసేందుకు ఉన్న అంశాలను పార్లమెంటు పరిశీలించాలి. ఫలితంగా అప్రజాస్వామిక పద్ధతులకు అడ్డుకట్ట వేయవచ్చు."
-సుప్రీంకోర్టు
ఇవీ చదవండి: