కర్ణాటక కొడగు జిల్లాలో ఓ పులి బీభత్సం సృష్టించింది. 24 గంటల్లో ఇద్దరిపై దాడి చేసి ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో వృద్ధుడితో పాటు బాలుడు మృతి చెందారు. సమాచారం అందిన అటవీశాఖ అధికారులు.. వరుస పులి దాడి ఘటనలపై దర్యాప్తు ప్రారంభించారు. మనుషులపై దాడి చేస్తున్న పులిని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
బాలుడిని పులి ఈడ్చుకెళ్లిన ఘటన.. కె బడగ గ్రామ పంచాయతీ పరిధిలోని చూరికాడు నెల్లిలో.. పని నిమిత్తం పూనచ్చ ఇంటికి తల్లిదండ్రులతో పాటు చేతన్(12) అనే బాలుడు కూడా వెళ్లాడు. సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంటి ముందున్న కాఫీ తోట వద్ద బాలుడు ఆడుకుంటున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన పులి ఆ బాలుడిపై దాడి చేసి తినేసింది. బాలుడు అక్కడికక్కడే మరణించాడు. కూలీ పనులకు వచ్చిన ఆ కుటుంబం.. కుమారుడి మృతితో శోకసంద్రంలో మునిగిపోయింది. .
వృద్ధుడి బలి.. కుట్ట గ్రామం పల్లారో ఓ వృద్ధుడిపై కూడా పులి దాడి చేసింది. ఈ ఘటనలో అతడు మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిని పల్లారికి చెందిన రాజు(70)గా గుర్తించారు. మృతుడు రాజు వ్యవసాయ పనుల నిమిత్తం కుట్టగ్రామానికి వచ్చాడు. అతడు తోటలో పని చేస్తుండగా పులి అతనిపై దాడి చేసి ఈడ్చుకెళ్లింది.
రైలు ఢీకొని నలుగురు కార్మికులు మృతి..
మహారాష్ట్ర నాసిక్ జిల్లా దారుణం జరిగింది. టవర్ వ్యాగన్ రైలు ఢీకొని నలుగురు కార్మికులు మృతి చెందారు. లాసల్గావ్ రైల్వే స్టేషన్లో ఉదయం ఐదు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
ఇదీ జరిగింది.. సోమవారం తెల్లవారు జామున లాసల్గావ్ రైల్వే స్టేషన్లో టవర్(లైట్ రిపేర్ చేసే ఇంజన్) లాసల్గావ్ నుంచి ఉగావ్ వైపు రాంగ్ రూట్లో వెళుతోంది. ట్రక్కు మెయింటెనెన్స్ సిబ్బందిను ఢీకొంది. దీంతో అక్కడికక్కడే నలుగురు కార్మికులు మరణించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనలో వ్యాగన్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన మూడు గంటల వరకు కూడా సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకోలేదని ఆరోపిస్తూ.. రైల్వే ఉద్యోగులు నిరసనకు తెలిపారు.