ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్‌లో జికా వైరస్(zika virus in india) కలకలం సృష్టిస్తోంది. తాజాగా మరో ముగ్గురికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు... వైరస్ వ్యాప్తి కట్టడికి చర్యలు చేపట్టారు. బాధితులతో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాన్పుర్‌లో ఇప్పటివరకు మొత్తం నలుగురికి జికా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది.
ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణలో జికా వైరస్ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. బాధితులను కలిసిన వారిని గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సీఎంఓ నేపాల్ సింగ్ తెలిపారు. వైరస్ ఎక్కడి నుంచి వ్యాప్తి చెందిందనే విషయాన్ని ఆరా తీస్తున్నామని చెప్పారు. వైద్య బృందాలు ఈ పనిలో నిమగ్నమయ్యాయని పేర్కొన్నారు.
కాన్పుర్‌లో అక్టోబరు 24న తొలి జికా కేసు నమోదైంది. వాయుసేనలో పనిచేసే ఓ అధికారి కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతూ వాయుసేన ఆస్పత్రిలో చేరారు. ఆయన వద్ద నుంచి సేకరించిన నమూనాలను పుణెలోని ప్రయోగశాలకు పంపించగా.. జికా వైరస్ బారినపడినట్లు నిర్ధరణ అయింది. బాధితుడితో సన్నిహతంగా ఉన్న మరో 22 మందిని అధికారులు ఐసొలేషన్‌లో ఉంచారు.
కాన్పుర్‌లో జికా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. వాయుసేన ఆస్పత్రి, జీఎస్వీఎం వైద్య కళాశాల, ఉర్సలా, డఫరీన్, కాన్షీరామ్ ఆస్పత్రికి చెందిన వైద్య నిపుణులతో ఆరోగ్య శాఖ డీఎం విశాఖ్ సమావేశమయ్యారు. వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ఇవీ చూడండి: