ఉత్తర్‌ప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో విషాదం జరిగింది. విషం కలిసిన టీ తాగి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. టీ తాగిన వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లారు ఐదుగురు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా ముగ్గురు చికిత్స పొందుతూ ఐదుగురు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భాయిదూజ్ సందర్భంగా నాగ్లా కాన్హి గ్రామానికి చెందిన శివానందన్ అనే వ్యక్తి ఇంటికి అతిథులు వచ్చారు. అతిథులకు భార్య రామామూర్తి ఉదయం సుమారు 8 గంటల సమయంలో టీ ఇచ్చింది. వ్రతం ఆచరిస్తున్న కారణంగా ఆమె టీ తాగకుండా స్నానం చేసేందుకు వెళ్లింది. తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో వాళ్లందరూ అపస్మారక స్థితిలో కనిపించారు. ఆందోళన చెందిన రామామూర్తి బిగ్గరగా కేకలు వేసింది. కేకలు విన్న గ్రామస్థులు అక్కడికి చేరుకుని వారందరిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె కుమారులు శివాంగ్, దివ్యాన్ష్తో పాటు శివానందన్ తండ్రి మృతి చెందారు. శివానందన్‌తో పాటు మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల వారిద్దరిని మరో ఆస్పత్రికి తరలించగా వారు కూడా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. టీ తయారీకి ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కోసం వాటిని పరీక్షలకు పంపించారు. రామామూర్తి స్ఫ్పహలోకి వెళ్లిందని.. కోలుకున్నాకా తదుపరి విచారణ ప్రారంభిస్తామని తెలిపారు. అయితే ఆమె పొరపాటున టీ పొడికి బదులు వరికి వాడే పురుగుల మందును కలిపిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఇదీ చదవండి: 'త్వరలోనే పీఓకే స్వాధీనం'.. పాక్‌కు రాజ్‌నాథ్ తీవ్ర హెచ్చరికలు
వెబ్ సిరీస్ చూసి మర్డర్ స్కెచ్.. భార్య ఆత్మహత్యను షూట్ చేసిన భర్త