Ambergris Smuggling: కోట్ల రూపాయలు విలువ చేసే అంబర్‌గ్రీస్‌ను (తిమింగళం వాంతి) అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు దిల్లీ పోలీసులు. ఈ క్రమంలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరు దిల్లీలోని మయూర్ విహార్‌కు చెందిన గౌతమ్ కుమార్ అలియాస్ శివ్, ఉత్తరాఖండ్‌కు చెందిన రాజేశ్ జోషి, ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహిబాబాద్కు చెందిన రోహిత్ సాగర్‌లుగా గుర్తించారు పోలీసులు. నిందితుల నుంచి రూ.22 కోట్లు విలువ చేసే అంబర్‌గ్రీస్, రెండు స్కూటీలను స్వాధీనం చేసుకున్నారు.
"ఏప్రిల్ 21న నిందితులు రాజేశ్ జోషి, గౌతమ్‌కుమార్‌లు అంబర్‌గ్రీస్ విక్రయించేందుకు కొనగోలదారుల కోసం వెతుకుతున్నట్లు మాకు సమాచారం అందింది. ఈ క్రమంలో అధికారుల ప్రత్యేక బృందం వారిని సంప్రదించి బయర్లుగా నమ్మించారు. లాజ్‌పత్ నగర్‌లోని నిందితుల చెప్పిన ప్రాంతానికి వెళ్లిన అధికారులు వారిని అరెస్ట్ చేశారు. ఆ పదార్థాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు దానిని పరీక్షలకు తరలించగా అది అంబర్‌గ్రీస్‌గా నిర్ధరణ అయింది." అని పోలీసులు వెల్లడించారు. ఇందుకు సంబంధించి శుక్రవారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
అంబర్‌గ్రీస్ పదార్థం సాధారణంగా తిమింగలం జీర్ణవ్యవస్థలో తయారవుతుంది. అది వాంతి చేసుకున్నప్పుడు, ఉమ్మినప్పుడు బయటకు వస్తుంది. సెంట్లు, పర్ఫ్యూమ్ల తయారీలో దీనిని వినియోగిస్తారు. ఒక్క కిలో అంబర్గ్రీస్కు రూ.కోట్లలో ధర ఉంటుంది. ఇండోనేషియా, ఇంగ్లాండ్‌లో ఈ పదార్థానికి విపరీతమైన డిమాండ్ ఉంది. అంబర్ గ్రీస్‌ను 1972 వన్యప్రాణుల చట్టం కింద నిషేధించారు.
ఇదీ చూడండి : పంజాబ్ సీఎం మరో కీలక నిర్ణయం.. వారికి భద్రత కట్