ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల పెరుగుదల చూస్తుంటే.. మూడోదశ అనివార్యమని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే ఎప్పుడొస్తుందో స్పష్టంగా చెప్పలేమని తెలిపింది. ఈ దశను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు కే విజయరాఘవన్ స్పష్టం చేశారు. కరోనా రెండోదశ ఎప్పుడు నియంత్రణలోకి వస్తుందో చెప్పలేమన్నారు. వైరస్‌లో ఏర్పడే మార్పులను ముందుగానే అంచనావేసి.. వాటికి అనుగుణంగా వ్యాక్సిన్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం ఎంతో అవసరమన్నారు.
కరోనా కేసులపై ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాలు..
- మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, యూపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 1.5 లక్షల చొప్పున యాక్టివ్‌కేసులు ఉండగా.. 12 రాష్ట్రాల్లో 50 వేల నుంచి లక్ష మధ్య.. మరో 17 రాష్ట్రాల్లో 50 వేల కంటే తక్కువ క్రియాశీలక కేసులున్నాయి.
- కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, బంగాల్, తమిళనాడు, బిహార్ రాష్ట్రాల్లో రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతుంది.
- మూడోదశ వ్యాక్సినేషన్లో భాగంగా మే 1 తేదీ నుంచి తొమ్మిది రాష్ట్రాల్లో 6.71 లక్షల మంది 18-44 మధ్య వయస్కులకు టీకా అందింది.
- రోజురోజుకూ 2.4 శాతం కొత్త కేసులు పెరుగుతున్నాయి.
- మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, దిల్లీ, హరియాణా రాష్ట్రాల్లో కరోనా మరణాలు పెరుగుతున్నాయి.
లాక్డౌన్ మాత్రమే పరిష్కారమా?
వైరస్ వ్యాప్తి నియంత్రణకు దేశవ్యాప్త లాక్డౌన్ మాత్రమే పరిష్కారమా? అనే ప్రశ్నకు.. "కొవిడ్ కట్టడిపై రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేశాం. అంతకుమించి ఏదైనా అవసరమనిపిస్తే దాని గురించి చర్చిస్తాం" అని బదులిచ్చారు నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్. అలాగే వైరస్ జంతువుల నుంచి సోకడం లేదని.. మనుషుల నుంచి మనుషులకే వ్యాపిస్తోందని చెప్పారు. పరివర్తన చెందిన వైరస్‌లను.. మాస్క్ ధరించడం, భౌతిక దూరం, చేతులు శుభ్రం చేసుకోవడం ద్వారా ఎదుర్కోవచ్చన్నారు.
ఇదీ చూడండి: మాస్క్ ఉల్లం'ఘనుల' నుంచి రూ. 54 కోట్ల వసూలు