ఉద్రిక్తతల నడుమ బంగాల్‌లో మూడో విడత ఎన్నికలు జరిగాయి. 31 నియోజకవర్గాల్లో 205 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఈ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 77.68 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. తాజాగా తుది గణాంకాలు విడుదల చేసింది.
టీఎంసీ నేత ఇంటిలో ఈవీఎంలు
ఉలుబెరియాలోని తృణమూల్ నేత నివాసంలో ఈవీఎం, వీవీ ప్యాట్ లను ఎన్నికల సంఘం అధికారులు గుర్తించారు. ఆ ప్రాంతంలోని ఎన్నికల ఆధికారిని సస్పెండ్ చేసినట్లు ఈసీ తెలిపింది. సిలిగురిలోని ఓ కిరాణా షాపులో ఐదు బాంబులను స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. టీఎంసీ నేతలు ప్రజలను ఓటు వేయకుండా అడ్డుకున్నారని 24 పరగణాల భాజపా అభ్యర్థి దీపక్ హాల్దార్ .. ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో భద్రత కట్టిదిట్టం చేశారు అధికారులు.
టీఎంసీ అభ్యర్థిపై దాడి
తృణమూల్ కాంగ్రెస్ ఆరంభాగ్ అభ్యర్ధి సుజాత మొండల్‌పై మహల్లాపరలోని 263వ పోలింగ్ కేంద్రం వద్ద దాడి జరిగింది. భాజపా గూండాలే తమ పార్టీ అభ్యర్ధిపై దాడికి పాల్పడ్డారని టీఎంసీ నేత, ఆ పార్టీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ ఆరోపించారు. ఈ దశలో పోలింగ్ జరిగిన 31 స్థానాల్లో దక్షిణ 24 పరగణాల జిల్లాలోనే 16 నియోజకవర్గాలు ఉండగా.. హుగ్లీలో ఎనిమిది, హావ్‌డాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి.
రాష్ట్రంలో మరో ఐదుదశల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది.
ఇదీ చూడండి: 'మే 2న టీఎంసీ కథ కంచికే!'