తమిళనాడులో కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం(ఎంఎన్‌ఎం)లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజా ఎన్నికల్లో పార్టీ పరాభవం నేపథ్యంలో ఇప్పటికే పలువురు పార్టీని వీడగా.. తాజాగా ఏకంగా ఉపాధ్యక్షుడు ఆర్.మహేంద్రన్ సైతం రాజీనామా సమర్పించారు. ఈ మేరకు ఆయన పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్‌కు పలు కారణాలను వివరిస్తూ లేఖ రాశారు.
మహేంద్రన్ రాజీనామాపై కమల్ హాసన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన్ను 'ద్రోహి'గా అభివర్ణించారు. మహేంద్రన్ రాజీనామా చేయకపోయినా పార్టీ నుంచి తామే తొలగించేవారమని తెలిపారు. పార్టీ నుంచి ఓ 'కలుపు మొక్క' బయటకు వెళ్లిందని.. దానికి తాము హర్షిస్తున్నామని వ్యాఖ్యానించారు. పిరికిపందల్లా పార్టీని వీడేవారి గురించి ఆలోచించేది లేదని తెలిపారు. కొంతమంది రాజీనామా వల్ల పార్టీ లక్ష్యం మాత్రం మారదని పేర్కొన్నారు.
రాజీనామా లేఖలో మహేంద్రన్ పలు ఆరోపణలు చేశారు. పార్టీలో కొందరు సలహాదారులు కమల్‌ను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. అలాగే కమల్ పార్టీ నడిపే తీరు కూడా ప్రజాస్వామ్యయుతంగా లేదన్నారు. పార్టీలో 'విభజించు-పాలించు' విధానం అమల్లో ఉందని ఆరోపించారు.
మహేంద్రన్‌తో పాటు పార్టీలో కీలక నేతలైన ఏజీ.మౌర్య, మురుగనందమ్, సీకే.కుమరావెల్, ఉమాదేవీ సైతం రాజీనామా చేసినట్లు పార్టీ అధికారిక ప్రకటనలో పేర్కొంది.
ఇదీ చదవండి: '24 గంటలు కాలేదు.. అప్పుడే రాష్ట్రపతి పాలనా?