విస్తరణ కాంక్షతో రగలిపోతున్న పొరుగుదేశం చైనా.. భారత్‌కు ఓ తలపోటులా మారుతోంది. తన వక్రబుద్ధితో సరిహద్దుల్లో నిత్యం బలగాలను మోహరిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో చైనా బలగాలు వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)ను దాటి భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు యత్నించాయి. అయితే, డ్రాగన్ చర్యను భారత సైన్యం సమర్థంగా నిలువరించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. గతవారం జరిగిన ఈ ఘటనతో ఇరు దేశాల బలగాల మధ్య కొంతసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది.
పెట్రిలింగ్ నిర్వహిస్తుండగా..
సరిహద్దుల్లో భారత బలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. దాదాపు 200 మంది పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) జవాన్లు వాస్తవాధీన రేఖకు అత్యంత సమీపంగా రావడాన్ని గుర్తించారు. వీరు ఎల్‌ఏసీని దాటేందుకు యత్నించగా భారత సైన్యం అడ్డుకుంది. ఈ క్రమంలో ఇరు దేశాల సైనికుల మధ్య కొన్ని గంటల పాటు ఘర్షణ తలెత్తింది. అయితే ఆ తర్వాత పరస్పర అంగీకారంతో ఇరు దేశాల బలగాలు వాస్తవాధీన రేఖ నుంచి వెనక్కి వెళ్లినట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో భారత సైన్యానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొన్నాయి.
గతంలో కూడా..
ఇదిలా ఉండగా.. గతంలో కూడా చైనా సరిహద్దుల్లో ఇలాంటి చొరబాటు యత్నాలకు పాల్పడింది. ఈ ఏడాది ఆగస్టు 30న దాదాపు 100 మంది చైనా జవాన్లు ఉత్తరాఖండ్‌లోని బారాహొతి ప్రాంతంలో వాస్తవాధీన రేఖను దాటి భారత భూభాగం వైపు 5 కిలోమీటర్ల లోపలికి వచ్చారు. దాదాపు మూడు గంటల పాటు మన భూభాగంలోనే ఉన్నారు. అక్కడి వంతెనను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసులు అక్కడకు చేరుకునే లోపు వారు వెనుదిరిగారు.
తూర్పు లద్దాఖ్ వివాదంలో పరిష్కారం కోసం భారత్, చైనా మధ్య మరికొద్ది రోజుల్లో ఉన్నత స్థాయి సమావేశం జరగనున్న సమయంలో అరుణాచల్‌లో ఘర్షణలు తలెత్తడం గమనార్హం. తూర్పు లద్దాఖ్ ఉద్రిక్తతల పరిష్కారం కోసం ఇరుదేశాల మధ్య ఇప్పటికే 12 సార్లు కమాండర్ స్థాయి చర్చలు జరగ్గా.. మరో రెండు మూడు రోజుల్లో 13వ దఫా సమావేశం జరగనున్నట్లు తెలిసింది. కాగా.. భారత్‌తో చర్చలకు ముందు చైనా పలుమార్లు ఇలానే ఘర్షణలకు దిగి కవ్వించే ప్రయత్నం చేసింది.
ఇదీ చూడండి: తైవాన్ గగనతలంలోకి 52 చైనా యుద్ధ విమానాలు