Retired IRS officer robbed in Hyderabad : పోలీసు దొంగైతే ఎలా ఉంటుంది. కథ మాములుగా ఉండదు కదా. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లోని ముషీరాబాద్ మండలం రాంనగర్లో చోటుచేసుకుంది. నమ్మిన అధికారినే నిలువెల్లా దోచుకున్నాడో ఎస్సై.. నమ్మించి.. మత్తు మందు ఇచ్చి ఇంట్లో ఉన్న ఆస్తి పేపర్లు, డబ్బు, బంగారం అంతా దోచేశాడు. అసలు ఏం జరిగిందంటే..?
హైదరాబాద్ గాంధీనగర్‌కి చెందిన.. విశ్రాంత ఐఆర్ఎస్ ఉద్యోగి శ్యామూల్ ప్రసాద్ భార్య పదేళ్ల క్రితమే చనిపోయారు. ఇద్దరు కుమారులు, కుమార్తె అమెరికాలో స్దిరపడగా ఆయన ఒంటరిగా ఉంటున్నాడు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న శ్యామూల్ ప్రసాద్‌కి.. విశాఖపట్నం, గోదావరి జిల్లాల్లో సొంత భూములున్నాయి. 2020 నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సురేందర్‌తో కలిసి సిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు. కొద్దికాలం క్రితం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఎస్సైతో సురేందర్‌కి పరిచయం ఏర్పడింది. తద్వారా మూడేళ్ల క్రితం ఆ ఎస్సై.. నగర శివారులోని విశ్రాంత అధికారి భూమి.. ఎకరా 30లక్షల చొప్పున 3 ఎకరాలు కొనుగోలు చేశాడు.
ఆ సమయంలోనే.. విశ్రాంత అధికారికి భారీగా ఆస్తులున్నట్టు గుర్తించాడు. అమెరికాలో ఉన్న పిల్లలతో సరైన సంబంధాల్లేవని గ్రహించాడు. వారు ఎట్టిపరిసితుల్లో స్వదేశం రాబోరన్న అభిప్రాయాన్ని సురేందర్‌తో పంచుకున్నాడు. ఏదో విధంగా శ్యామూల్‌ప్రసాద్‌ని నమ్మించి సిరాస్తి పత్రాలు తెస్తే తెలిసిన సబ్‌రిజిస్ట్రార్ ద్వారా మార్పిడిచేద్దామంటూ.. ఎస్సై సలహా ఇచ్చాడు. ప్రతిఫలంగా పెద్దఎత్తున కమీషన్ ఇస్తానని ఆశచూపగా.. శ్యామూల్ ప్రసాద్‌తో సురేందర్ మరింత దగ్గరయ్యాడు.
Theft at Retired IRS Officer House : ఇటీవల స్ధలం విక్రయించగా డబ్బులు వచ్చాయని వాటితో విశాఖలో భూములు కొనాలని నమ్మించాడు. అది నిజమని భావించిన విశ్రాంత అధికారి సోదరి వద్దనున్న విశాఖలోని ఆస్తిపత్రాలు తెప్పించి చూపించాడు. అనంతరం సురేందర్‌తో కలిసి విశ్రాంత అధికారి ఇటీవలే విశాఖపట్నం వెళ్లి స్థలాలు చూశారు. తరచూ శామ్యూల్ ఇంటికొచ్చే సురేందర్.. ఇంట్లో విలువైన పత్రాలు, ఆభరణాలు కాజేసేందుకు పథకరచన చేశారు. మే 31న పనిమనిషి సెలవుపెట్టగా.. గాంధీనగర్‌లోని ఇంటికి వెళ్లిన సురేందర్.. విశాఖలోని స్థలానికి చెందిన అసలు పత్రాలు కావాలన్నాడు. అతను మరోగదిలోకి వెళ్లగా అల్పహారంపై.. తెచ్చుకున్న మత్తుమందుచల్లాడు. అది తిన్న బాధితుడు అపస్మారక స్ధితిలోకి వెళ్లగా నిందితుడు సురేందర్... బీరువాలోని విలువైన పత్రాలు, డబ్బు, బంగారం, వెండి తీసుకొని బయటి నుంచి తాళంవేసి వెళ్లిపోయాడు.
రెండురోజులుగా ఫోన్ చేస్తున్నా శ్యామూల్ ప్రసాద్ స్పందించకపోవటంతో ఆయన సోదరి గాంధీనగర్ ఇంటికివచ్చారు. అనుమానంతో ఇంటితాళం పగులగొట్టి చూశారు. అపస్మార సితిలో పడిఉన్న ఆయన్ని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నాలుగు రోజుల తర్వాత కోమా నుంచి బయటికి వచ్చిన ఆయన ఇంటికెళ్లి చూడగా.. డబ్బు, బంగారం, స్థిరాస్తి పత్రాలు మాయమైనట్లు గుర్తించాడు.
చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పరారీలో ఉన్న నిందితుడు సురేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి పూర్తి సమాచారం సేకరించాక అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చోరీ కేసులో నిందితుడికి సహకరించిన ఎస్సై, పనిమనిషి పాత్రపై ఆరా పోలీసులు తీస్తున్నారు. నిందితుడిని కస్టడీకి తీసుకొని.. మరింత సమాచారం రాబట్టేందుకు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సైబరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై రెండ్రోజులుగా వ్యక్తిగత సెలవులో ఉన్నట్టు సమాచారం. కొద్దిరోజుల క్రితం ఒకరు.. కారులో భూములకు చెందిన పత్రాలు తీసుకొచ్చి ఎస్సైకు ఇచ్చినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించినట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: