అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతిని ఎలాగైనా కాపాడుకోవాలని అనుకున్నారు గ్రామస్థులు. అందుకు చాలా మొత్తంగా డబ్బులు అవసరమవుతాయని గ్రహించారు. ఈ క్రమంలో వారికి ఒక ఆలోచన వచ్చింది. ఫుట్‌బాల్ టోర్నమెంట్ నిర్వహించి.. ఆ ఫీజులతో వచ్చిన డబ్బులను రోగికి అందించవచ్చని భావించారు. అనుకున్నదే తడవుగా ఆ ఆలోచనను ఆచరణలో పెట్టారు తమిళనాడు.. నీలగిరి జిల్లాలోని కడకంపట్టి గ్రామస్థులు. వారు ఇంతలా ఆ యువతి కోసం ఎందుకు కష్టపడ్డారో? ఆ యువతి ఏ అనారోగ్య సమస్యతో బాధపడుతుందో ఓ సారి తెలుసుకుందామా మరి.
కడకంపట్టి గ్రామానికి చెందిన అశ్విని అనే వివాహితకు.. రెండు కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆమె ప్రస్తుతం కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అశ్విని నిరుపేద కుటుంబానికి చెందిన యువతి. కిడ్నీ మార్పిడి చేయించుకోవాలని వైద్యులు ఆమెకు సూచించారు. అయితే ఆశ్విని కుటుంబానికి అంత స్తోమత లేదు. ఈ విషయం తెలుసుకున్న కడకంపట్టి గ్రామస్థులు.. అశ్వినికి ఎలాగైనా సాయం చేయాలని అనుకున్నారు. వివిధ మార్గాల్లో ఆమె చికిత్స కోసం నిధులను సేకరించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా కడకంపట్టి భారతి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఫుట్ బాల్ పోటీలు నిర్వహించాలని నిశ్చయించారు. టోర్నమెంట్లో ఫీజుల రూపంలో వచ్చిన డబ్బుల్ని అశ్విని వైద్య ఖర్చుల కోసం కేటాయించాలని నిర్ణయించారు.
గత వారం జిల్లా స్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్ను ప్రారంభించింది కడకంపట్టి భారతి యూత్ క్లబ్. వారం రోజుల పాటు ఈ టోర్నమెంట్లో 16 మ్యాచ్‌లు జరిగాయి. కట్టబెట్టు, ఉయిలట్టి జట్లు ఫైనల్కు చేరాయి. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్లో ఎవరూ గోల్ చేయకపోవడం వల్ల మ్యాచ్ డ్రాగా ముగిసింది. మళ్లీ 30 నిమిషాలు మ్యాచ్( టై బ్రేకర్) నిర్వహించగా కట్టబెట్టు జట్టు విజయం సాధించింది. విజేతకు గ్రామ కార్యదర్శి రమేశ్ ట్రోఫీని అందించారు. ఈ ఫైనల్ మ్యాచ్ను వీక్షించేందుకు ముఖ్య అథితులుగా నీలగిరి జిల్లా ఫుట్‌బాల్ క్లబ్ ఉపాధ్యక్షుడు గోపాలకృష్ణ, కాంగ్రెస్ నాయకులు అష్రఫ్ అలీ, సిల్లబాబు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
"కడకంపట్టి గ్రామానికి చెందిన అశ్విని అనే వివాహిత కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతోంది. కిడ్నీ మార్పిడికి డబ్బులు కోసం ఆమె కుటుంబం ఇబ్బందులు పడుతోంది. ఆమె ఆర్థిక పరిస్థితి చూసి మాకు బాధ కలిగింది. ఆమెను ఎలాగైనా ఆదుకోవాలనుకున్నాం. ఫుట్‌బాల్ మ్యాచ్‌ల ద్వారా నిధులు సేకరించాలని నిర్ణయించుకున్నాం. అస్పత్రిలో చికిత్స పొందుతున్న అశ్విని త్వరగా కోలుకోవాలి. ఆమెకు అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఫుట్‌బాల్ టోర్నమెంట్ ద్వారా వచ్చిన రూ.4లక్షలను అశ్విని వైద్యం కోసం కోయంబత్తూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి పంపించాం."
--కడకంపట్టి గ్రామస్థులు