తమిళనాడులోని ఓ ఆలయంలో చోరీ చేయడానికి ప్రయత్నించిన దొంగ.. అక్కడే నిద్రపోయి పోలీసులకు చిక్కాడు. గుడిలోని దేవుడి నగలు దొంగలించడానికి బీరువాను తెరిచేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. దీంతో ఆయాస పడిన దొంగ అక్కడే నిద్రపోయాడు. ఎప్పటిలానే ఉదయాన్నే గుడి తలుపులు తెరిచిన పూజారి.. దొంగను చూసి షాక్ గురయ్యాడు.
ఇదీ జరిగింది
చెన్నైలోని వ్యాసర్పాడి శర్మ నగర్లో ఉన్న 50 ఏళ్ల వినాయకుడి గుడి ఉంది. ఆ గుడిలోని దేవుడి నగలు చోరీ చేసేందుకు సోమవారం రాత్రి ఆలయంలోకి ఓ దొంగ ప్రవేశించాడు. నగల కోసం ఆలయంలో ఉన్న బీరువాను తెరిచేందుకు ప్రయత్నించాడు. కానీ అది తెరుచుకోలేదు. దీంతో పక్కనే ఉన్న మరో బీరువాను తెరిచాడు. దానిలో ఉన్న బట్టలన్నీ తీసి.. నగలు కోసం వెతికాడు కానీ అందులో ఏం దొరకలేదు. దీంతో దొంగకి ఆయాసం వచ్చి అక్కడే నిద్రపోయాడు.
ఎప్పటిలానే ఆలయ పూజారి తలుపులు తెరిచి చూడగా బీరువాలోని బట్టలన్నీ చెల్లచెదురుగా పడి ఉన్నాయి. ఆ పక్కనే మంచి నిద్రలో ఉన్న ఓ వ్యక్తిని చూసి పూజారి ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. వెంటనే ఆలయ అధికారులను సమాచారం అందించాడు. అక్కడకు చేరుకున్న అధికారులు అతన్ని పట్టుకుని విచారించగా.. దొంగతనానికి వచ్చి ఆలయంలో నిద్రించినట్లు వెల్లడించాడు. అనంతరం ఆలయ నిర్వాహకులు దొంగను పోలీసులకు అప్పగించారు. అయితే ఆ దొంగ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని పోలీసులు తెలిపారు. అనంతరం అతడిని కస్టడీకి తరలించారు.