మహిస్యాలకు ఓబీసీ హోదా దక్కితే.. ఆ కేటగిరీలో అత్యంత ప్రాబల్యమైన వర్గంగా వారు అవతరించే అవకాశముంది. వారు కలిసినా ఓబీసీ రిజర్వేషన్ పెరగదు కాబట్టి విద్య, ఉద్యోగ రంగాల్లో అంతర్గత పోటీ తీవ్రమవుతుందని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇతర కులాల ఆగ్రహానికి అది కారణమవ్వొచ్చని జోస్యం చెబుతున్నారు.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ బెంగాల్ రాజకీయాలు కుల సమీకరణల చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని అతిపెద్ద కులాల్లో ఒకటైన మహిస్య వర్గాన్ని తమవైపునకు తిప్పుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్, భాజపా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మహిస్యాలను ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) జాబితాలో చేరుస్తామని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల వాగ్దానం చేయగా... తృణమూల్ కాంగ్రెస్ కూడా తమ మేనిఫెస్టోలో అదే హామీ ఇచ్చింది. బెంగాల్ రాజకీయాల్లో మహిస్యాల ప్రాధాన్యానికి ఇరు పార్టీల హామీలు అద్దం పడుతున్నాయి.
దక్షిణ బెంగాల్‌లో ప్రాబల్యం
బెంగాల్‌లో మహిస్యాలు ప్రస్తుతం జనరల్ కేటగిరీలో ఉన్నారు. వారి సంఖ్య ఎంత ఉంటుందనేది స్పష్టంగా తెలియదు. 1931 నుంచీ ఎస్సీ, ఎస్టీ మినహా ఇతర వర్గాల్లో కులాలవారీ జనగణన చేపట్టకపోవడం ఇందుకు ప్రధాన కారణం. 1921 నాటి జనగణన ప్రకారం రాష్ట్రంలో వారి సంఖ్య 25 లక్షలు. వీరంతా ఎక్కువగా దక్షిణ బెంగాల్‌లోనే నివసించేవారు కావడంతో.. రాష్ట్ర విభజన ప్రభావం వారిపై పెద్దగా పడలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో మహిస్యాల జనాభా 1.5 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ముఖ్యంగా దక్షిణ బెంగాల్ జిల్లాలైన మిడ్నాపోర్, హావ్‌డా, హుగ్లీల్లో వీరి ప్రాబల్యం అధికం. నదియా, 24 పరగణాల్లోనూ మహిస్యాల జనాభా ఎక్కువే.
ఒకప్పుడు ఎస్సీ కేటగిరీలో!
1931 వరకు మహిస్యాలను రాష్ట్రంలో సాంకేతికంగా ఎస్సీ వర్గంగా పరిగణించేవారు. దాన్ని ఆ కులంలోని పలువురు వ్యతిరేకించేవారు. తమను ఉన్నత వర్గంగా పరిగణించాలని జనగణన అధికారులకు అప్పట్లో లేఖలు రాశారు. తర్వాత పరిణామాలతో మహిస్యాలను జనరల్ కేటగిరీలో చేర్చారు.
రాష్ట్ర రాజకీయాల్లో కింగ్‌మేకర్లు
మొదటి నుంచి మహిస్యాలు కాంగ్రెస్‌కు బలమైన మద్దతుదారులుగా ఉన్నారు. క్విట్ ఇండియా వంటి ఉద్యమాల్లో ఆ పార్టీకి సంపూర్ణ సహకారం అందించారు. 1960ల నాటికి వారు బెంగాల్ రాజకీయాల్లో కింగ్ మేకర్లుగా అవతరించారు. ఆ దశాబ్దంలోనే మహిస్యాల్లోని ఓ వర్గం వామపక్షాలతో చేతులు కలిపింది. తర్వాత వామపక్షాల్లో, వారి ప్రభుత్వాల్లో మహిస్యా నేతలు పలు కీలక పదవులు దక్కించుకున్నారు.
'ఓబీసీ' కోసం ఐక్య పోరాటం
1989 నుంచీ మహిస్యాల్లోని దిగువ వర్గం ప్రజలు ఓబీసీ హోదా కోసం పోరాడుతున్నారు. ఆ కులంలోని ఉన్నత వర్గం వ్యక్తులు తొలినాళ్లలో దాన్ని వ్యతిరేకించారు. అయితే- విద్య, ఉద్యోగ రంగాల్లో దక్కే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారు కూడా తర్వాత ఓబీసీ హోదా పోరాటానికి మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో తృణమూల్, భాజపాల హామీలు మహిస్యాలపై ఎంతమేరకు ప్రభావం చూపిస్తాయి? ఏ పార్టీకి వారు అండగా నిలవబోతున్నారు అనే విషయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.