వంద మీటర్ల పరుగు పందెం అంటే వెంటనే గుర్తొచ్చేది జమైకాకు చెందిన స్టార్ స్ప్రింటర్ ఉసేన్‌బోల్ట్‌నే. చిరుత వేగంతో దూసుకెళ్లే బోల్ట్ 2009లో వంద మీటర్లను 9.58 సెకన్లలో పూర్తి చేశాడు. పుష్కరం దాటినా ఆ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. కానీ సింథటిక్ ట్రాక్‌లో కాకుండా అడుగు వరకు ఉన్న బురద మడిలో పరుగెత్తుతూ ఆ రికార్డును ఒక్కసారి కాదు.. రెండుసార్లు తిరగరాశాడు మన శ్రీనివాస గౌడ.
రికార్డుల రాజు
కంబళ కర్ణాటకలోని కరావళి జానపద క్రీడ. బురద ట్రాక్‌లో రెండు దున్నల వెనక ఎవరు వేగంగా పరుగెత్తి తక్కువ సమయంలో గమ్యాన్ని చేరితే వారే విజేతలు. శ్రీనివాసగౌడ గతేడాది 145 మీటర్ల పోటీ దూరాన్ని 13.62 సెకన్లలో అధిగమించాడు. ఆ వేగాన్ని వంద మీటర్లతో లెక్కగడితే కేవలం 9.55 సెకన్లలో అధిగమించినట్లు న్యాయనిర్ణేతలు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా అతడి పేరు మార్మోగిపోయింది. తొలిసారి ఓ గ్రామీణ యువకుడు ఉసేన్ బోల్ట్ రికార్డును తలదన్నే వేగాన్ని సాధించటం ఓ చరిత్ర. కానీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయాలేవీ తనకు తెలియవు. మళ్లీ ఎప్పట్లాగే ఇతర పోటీలకు సన్నద్ధం కాసాగాడు. తర్వాత నిషాంత్ శెట్టి అనే యువకుడు ఆ రికార్డును తిరగరాశాడు. అప్పట్నుంచి అతడి దృష్టి అంతా మళ్లీ కొత్త రికార్డు సాధించడంపైనే నిలిచింది. మరింత కఠోర సాధన చేయసాగాడు. తర్వాత తానేంటో నిరూపించుకునే సమయం రానే వచ్చింది. మార్చి 31న ముగిసిన కంబళ పోటీల్లో శ్రీనివాస వారం వ్యవధిలోనే తన రికార్డును తానే అధిగమించాడు. వరుసగా 8.96 సెకన్లు, 8.78 సెకన్లలో పోటీ పూర్తి చేశాడు.
రెండు వారాల్లోనే
31 ఏళ్ల శ్రీనివాస గౌడది కర్ణాటకలోని మంగళూరు జిల్లా అశ్వత్థపుర. ఇంట్లో ఆర్థిక సమస్యలతో పదవతరగతి కాగానే చదువాపేశాడు. కుటుంబానికి చేదోడుగా ఉండేందుకు నిర్మాణ కార్మికుడిగా, వ్యవసాయ కూలీగా మారాడు. 15 ఏళ్ల వయసులో పొలం యజమానుల పశువులను మేపుతూ, చెరువుల్లో స్నానం చేయించేవాడు. ఈ సమయంలోనే వాటిని వేగంగా తరుముతూ వెంటపడి పరుగులు తీసేవాడు. ఈ క్రమంలో ఊరి పరిసరాల్లో కంబళ పోటీలు నిర్వహిస్తుంటే ఆసక్తిగా గమనించేవాడు. 2011లో కాంతప్ప గౌడ అనే మోతుబరి దున్నలను పరుగెత్తించే యువకుడు లేకపోవటంతో శ్రీనివాస గౌడకు అవకాశం ఇచ్చాడు. దీనికోసం కార్కళలో ఏర్పాటైన కంబళ సమితి ఇచ్చే శిక్షణలో చేరాడు. కేవలం రెండు వారాల శిక్షణతోనే మియరు ప్రాంతంలోని లవకుశ మైదానంలో తొలిసారిగా కంబళ పోటీలో పాల్గొని తొలి పోటీలోనే విజేతగా నిలిచాడు. అప్పట్నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. గడిచిన పదేళ్లలో 250కిపైగా ప్రథమ బహుమతులు శ్రీనివాసగౌడ ఖాతాలో జమ అయ్యాయి. గతేడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ‘ఐకళ బావా’ పోటీల్లో 145 మీటర్ల దూరాన్ని 13.62 సెకన్లలో అధిగమించి ప్రపంచం దృష్టిలో పడ్డాడు.
ప్రపంచ మెప్పు
శ్రీనివాస గతేడాది ఫిబ్రవరిలో ఉసేన్‌బోల్ట్ రికార్డును అధిగమించిన వెంటనే రాత్రికి రాత్రే సెలెబ్రెటీగా మారిపోయాడు. ఇది అధికారిక రికార్డు కాకపోయినా జాతీయ, అంతర్జాతీయ, సామాజిక మాధ్యమాలు అతడిని ఆకాశానికి ఎత్తేశాయి. మేటి అథ్లెట్‌కి ఏమాత్రం తీసిపోని సామర్థ్యం ఉన్న శ్రీనివాసగౌడకు ఒలింపిక్స్ శిక్షణ ఇప్పించాలని మహీంద్ర అండ్ మహీంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర కేంద్ర క్రీడల మంత్రికి ట్యాగ్ చేశారు. అప్పటి క్రీడల మంత్రి కిరణ్ రిజుజూ శ్రీనివాసకి నేరుగా ఫోన్ చేశారు. మాజీ మంత్రి శశి థరూర్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సుధామూర్తి, బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్‌లు కూడా శ్రీనివాసని ఆకాశానికి ఎత్తేశారు.
తాళ్లతో కట్టి మరీ..
" ఎంతో ఫిట్‌గా ఉంటేగానీ కంబళ పోటీల్లో పాల్గొనడం సాధ్యం కాదు. దీనికోసం రోజూ చెరువుల్లో దున్నలతో పాటు ఈత కొట్టడం, ఆపై వాటితో కనీసం ఆరు కిలోమీటర్ల వాకింగ్ చేస్తాడు. వేగాన్ని పెంచుకునేందుకు ద్విచక్రవాహనాలకు తాళ్లు కట్టి మరీ పరుగెత్తుతాడు. గంజి అన్నంతోపాటు చేపలు ఎక్కువగా తీసుకుంటాడు. వ్యవసాయ పనులు, భవనాల కట్టడంతోనే తన శరీరం పటిష్ఠంగా తయారైందంటాడు శ్రీనివాస."
- కె.ముకుంద, బెంగళూరు
ఇవీ చూడండి: కంబళ క్షేత్రంలో రికార్డుల పంట పండిస్తున్న వీరుడు