కేరళలో లాక్డౌన్ సమయం అది. దుకాణాలన్నీ మూతపడ్డాయి. తినడానికి తిండి దొరకని పరిస్థితి. లాక్‌డౌన్‌కు కొన్ని రోజుల ముందే దుబాయ్ నుంచి వచ్చిన ఓ కుర్రాడు.. ఈ పరిస్థితులను చూసి చలించిపోయాడు. తన వద్ద ఉన్న ఓ ఆలోచనను ఆచరణలోకి తీసుకొచ్చి.. తన చుట్టుపక్కల ఉన్న వారికి ఆహారాన్ని అందించాడు. ఇప్పుడు వారంతా తమ వంటింటి అవసరాలను స్వయంగా తీర్చుకోగలుగుతున్నారు. మరి ఆ కుర్రాడి కథను ఓసారి చూసెద్దాం..
దుబాయ్ టు కేరళ..
దుబాయ్‌లో నివసించే 22ఏళ్ల ఎయిర్‌క్రాఫ్ట్ నిర్వహణ ఇంజినీర్ సిజో జకారియా... లాక్‌డౌన్‌కు ముందు తన బంధవుల పెళ్లి వేడుకల కోసం కేరళలోని అలప్పుజకు వచ్చాడు. కానీ పరిస్థితులు తారుమారయ్యి భారత్‌లో ఉండిపోయాడు. ఇంతలో తమ దగ్గరున్న ఆహార పదార్థాలన్నీ ఖాళీ అవ్వడం మొదలయ్యాయి. బయటకు వెళ్లినా.. ఏమీ దొరకని పరిస్థితి.
ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో.. జకారియాకు ఓ ఆలోచన వచ్చింది. సమీప దుకాణాల నుంచి కొన్ని పండ్లు, కూరగాయల విత్తనాలను తన తండ్రితో కలిసి సేకరించాడు. వాటిని తమకున్న స్థలంలో నాటారు. కొబ్బరి, పనస, లిచీ వంటి పండ్ల చెట్లు అప్పటికే అక్కడున్నాయి. జకారియా తన తాత సలహాలు, యూట్యూబ్ వీడియోలు చూస్తూ తక్కువ స్థలంలోనే సేంద్రీయ పద్ధతిలో ఆ చెట్ల పెంపకాన్ని చేపట్టాడు.
20 కుటుంబాలకు ఆసరా..
అవి తక్కువ సమయంలోనే ఏపుగా పెరిగి, చుట్టుపక్కల ఉన్న 20 కుటుంబాలకు ఆహారాన్ని అందించే విధంగా మారాయి. ఆ తర్వాత అతడు తన సాగు మెళకువలను ఇరుగుపొరుగు వారికి నేర్పించాడు.
ఆ తర్వాత జకారియా దుబాయ్‌కి తిరిగి వెళ్లిపోయాడు. కానీ అక్కడి వారు జకారియా విధానాలను పాటిస్తూ... తమకు కావాల్సిన ఆహార పదార్థాలను తమ పెరట్లోనే పండించుకోగలుగుతున్నారు.
"నా దగ్గర సమయం ఉంది. శక్తి ఉంది. అలాంటప్పుడు ఇతరుల కోసం ఏదో ఒక మంచిపని ఎందుకు చేయకూడదని నాకు అనిపించింది. లాక్డౌన్ సమయంలో దుకాణాలు అన్ని మూతపడ్డాయి. మా దగ్గర ఉన్న ఆహారాన్ని మా చుట్టుపక్కల వాళ్లతో పంచుకున్నాం. వాళ్ల దగ్గర ఉన్నది మాకు ఇచ్చారు. అదే సమయంలో మేము విత్తనాలను దాచి పెట్టి మొక్కలను పెంచడం ప్రారంభించాము. ఆ తర్వాత వాటిని ఎలా పండించాలో మా చుట్టుపక్కల వారికి నేర్పడం మొదలుపెట్టాం."
-- జకారియా, దుబాయ్
ప్రకృతికి దగ్గరగా ఉంటూ, ఇతరులకు సేవ చేయడంలోనే అసలైన ఆనందం ఉందని అంటున్నాడు జకారియా. తన కేరళ పర్యటన ద్వారా తన తండ్రితో గడిపేందుకు మంచి సమయం దొరికిందని తెలిపాడు. ఇకపై తాను ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజినీర్‌గా కాకుండా ఓ రైతుగా మారుతానని సంతోషంగా చెప్పాడు జకారియా.
ఇదీ చూడండి:వారి జీవితమంతా కన్నీటి వెతలే, కష్టాల కథలే!