బంగాల్లోని నందిగ్రామ్‌లో సీఎం మమత గాయపడిన ఘటనపై ఈసీ స్పందించింది. డీజీపీ వీరేందర్‌ను విధుల నుంచి తప్పించిన 24గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకుందని, సీఎంకు భద్రత కల్పించడంలో ఈసీ వైఫల్యం చెందిందని పేర్కొంటూ టీఎంసీ నేతలు రాసిన లేఖను తప్పుబట్టింది.
నందిగ్రామ్‌లో జరిగిన ఘటన దురదృష్టకరమని పేర్కొన్న కేంద్ర ఎన్నికల సంఘం.. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగాల్సి ఉందని పేర్కొంది.
ఇదీ చూడండి: 'మమతపై దాడి' సీసీటీవీ ఫుటేజ్ విడుదల!
బంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై నందిగ్రామ్‌లో దాడి చేశారని ఆ పార్టీ నేతలు లేఖ రాశారు. అయితే, శాంతి భద్రతల అంశం పూర్తిగా తమ పరిధిలో ఉందనేది తప్పు అని ఈసీ తెలిపింది. లేఖలో వారి ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పేర్కొంది.
మరోవైపు, నందిగ్రామ్‌లో నామినేషన్ వేసిన తర్వాత ఓ ఆలయాన్ని సందర్శించిన సమయంలో దీదీ కాలికి గాయమైన ఘటనపై రాజకీయ దుమారం రేగింది. టీఎంసీ, భాజపా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎంపై కుట్ర పూరితంగానే దాడి జరిగిందని తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుండగా.. ఆమెపై ఎలాంటి దాడి జరగలేదని, ప్రజల్లో సానుభూతి పొందేందుకే ప్రమాద ఘటనను రాజకీయం చేస్తున్నారంటూ భాజపా కౌంటర్ ఇచ్చింది.
ఇదీ చదవండి: కార్యకర్తలు సంయమనం పాటించాలి: దీదీ