ఎటు చూసినా మృతదేహాలే. నలువైపులా శవాల గుట్టలే. సామర్థ్యానికి మించిన స్థాయిలో మృతదేహాలు వెల్లువెత్తుతుంటే ఆసుపత్రి వర్గాలు నిస్సహాయంగా చూడాల్సి వస్తోంది. ఇది ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో అతిపెద్దదైన డాక్టర్ భీమ్‌రావు అంబేడ్కర్ స్మారక ప్రభుత్వ ఆసుపత్రిలో దయనీయ స్థితి. కరోనా కరాళ నృత్యానికి ఇక్కడి శవాగారం తార్కాణంగా కనిపిస్తోంది.
అనూహ్య రీతిలో ప్రాణనష్టం వాటిల్లుతుండడంతో భద్రపరిచే అవకాశం లేక శవాలను గోనెసంచుల్లో కూరి ఆరుబయటే వదిలేస్తున్నారు. అంత్యక్రియలకు వెళ్తున్న మృతదేహాల కంటే ఎక్కువే ప్రతిరోజూ మార్చురీకి వస్తున్నాయని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. సాధారణం కంటే పదిరెట్లు ఎక్కువ శవాలు వస్తుండడంతో పరిస్థితి అర్థం కావడం లేదని, ఒకేసారి అన్ని అదనపు ఫ్రీజర్లు ఎలా ఏర్పాటు చేయగలమని నిస్సహాయంగా ప్రశ్నిస్తున్నాయి. శ్మశాన వాటికలూ సరిపోవడం లేదని పేర్కొంటున్నాయి.
ఇదీ చదవండి: కొవిడ్ కేర్ సెంటర్లుగా స్టార్ హోటళ్లు..!