మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరాపై రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోంశాఖ. ఆక్సిజన్ రవాణాపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది. రవాణాలో ఆటంకాలు తలెత్తకుండా స్వేచ్ఛాయుత సరఫరా కోసం.. రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేయాలని సూచించింది. అంతరాష్ట్ర రవాణాకు ఆటంకం లేకుండా చూడాలని పేర్కొంది. ఆక్సిజన్ రవాణాలో ఆటంకం తలెత్తితే స్థానిక జిల్లా మెజిస్ట్రేట్, ఎస్పీలే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది.
విపత్తు నిర్వహణ చట్టం-2005 కింద ఈ ఆదేశాలు జారీ చేశారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు మెడికల్ ఆక్సిజన్ సరఫరాను పలు రాష్ట్రాలు అడ్డుకుంటున్నాయన్న వార్తల నేపథ్యంలో ఈ మేరకు చర్యలు చేపట్టారు. కొవిడ్ చికిత్సలో మెడికల్ ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం లేకుండా చేయటం కీలకమన్నారు.
హోంశాఖ ఆదేశాల్లోని మరిన్ని అంశాలు..
- రాష్ట్రాల సరిహద్దుల్లో ఆక్సిజన్ సరఫరాకు ఎలాంటి ఆంటంకం లేకుండా చూడాలి. అంతరాష్ట్ర రవాణాలో ఆటంకం కలిగించకుండా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి.
- ఆక్సిజన్ తయారీ సంస్థలు, రవాణాదారులపై ఎలాంటి ఆంక్షలు విధించొద్దు.
- ఆయా రాష్ట్రాల్లోని ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా చేసే వాహనాలపై ఎలాంటి ఆంక్షలు ఉండకుండా చూడాలి. అలాగే.. నగరాల మధ్య కూడా రవాణాపై ఆంక్షలు విధించొద్దు.
- తమ ప్రాంతం గుండా వెళ్లే ఆక్సిజన్ వాహనాలను.. నిర్దిష్ట ప్రాంతాలకు మళ్లించే అధికారం ఎవరికీ లేదు.
- ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన 9 సంస్థలు తప్ప మిగతా పారిశ్రామిక అవసరాలకు ఆక్సిజన్‌ను వినియోగించొద్దు.
ఇదీ చూడండి: ఈ పరికరంతో 2 నిమిషాల్లోనే కరోనా ఫలితం!