బిహార్‌లోని బెగూసరాయ్‌లోని బుఢీ గండక్ నదిపై ఉన్న వంతెన ఆదివారం కుప్పకూలిపోయింది. గోవింద్‌పూర్, రాజౌరా వెళ్లే సాహెబ్‌పుర్ కమల్ బ్లాక్‌లోని బుఢీ గండక్ నదిపై నిర్మించిన బిష్ణుపుర్ అహోక్ ఘాట్ వంతెనను ముఖ్యమంత్రి నావార్డ్ యోజన కింద 2017 సంవత్సరంలోనే పూర్తి చేశారు. ఈ వంతెన నిర్మాణాన్ని మా భగవతి నిర్మాణ సంస్థ చేపట్టింది. దీని నిర్మాణానికి రూ.13.43 కోట్లు ఖర్చు చేశారు. కానీ అప్రోచ్ రోడ్డు లేకపోవడం వల్ల.. ఈ వంతెనకు ప్రారంభోత్సవం నిర్వహించలేదు.
ఈ వంతెన కూలిపోయిన సమాచారం అందుకున్న వెంటనే ఎస్‌డీఓ రోహిత్‌కుమార్, ఎస్‌డీపీవో కుమార్ వీరేంద్ర, పలువురు అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆ వంతెనపై వాహనాల రాకపోకలు లేనందున పెద్ద ప్రమాదం తప్పిపోయిందని స్థానికులు అంటున్నారు. అయితే, వంతెన నిర్మించిన కాంట్రాక్టర్‌ను వెంటనే అరెస్టు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
"ఈ వంతెన నిర్మాణంలో భారీ దోపిడీలు జరిగాయి. వంతెన ప్రారంభానికి ముందే నదిలో మునిగిపోవటమే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. వంతెనను నిర్మించిన ఏజెన్సీ కాంట్రాక్టర్‌ను వెంటనే అరెస్టు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా."
-సంజయ్ యాదవ్, నాయకుడు, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)