స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తరువాత ఆ గ్రామ ప్రజలు విద్యుత్ వెలుగులను కళ్లారా చూశారు. దేశమంతా 5జీ ఇంటర్నెట్ సేవలు విస్తరిస్తున్న వేళ.. కరెంటుకు నోచుకోని ఆ పల్లెవాసులు తొలిసారిగా విద్యుత్ సౌకర్యాన్ని పొందారు. ఇన్నేళ్లుగా కిరోసిన్ దీపాలు, కొవ్వొత్తుల మధ్య జీవితాన్ని వెళ్లదీసిన కుటుంబాలు కరెంట్ రాకతో.. ఆనందంలో మునిగిపోతున్నారు. వారే జమ్ము కశ్మీర్, అనంత్‌నాగ్ జిల్లా డోరు బ్లాక్‌లోని టెథాన్ ప్రాంత ప్రజలు.
ఈ గ్రామంలో మొత్తం 60 కుటుంబాలు ఉంటాయి. దాదాపుగా 200 మంది ఇక్కడ నివసిస్తున్నారు. కొండ ప్రాంతంలో ఉండే ఈ గ్రామానికి విద్యుత్ సౌకర్యాన్ని అందించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు. 2022 సంవత్సరంలో పనులు ప్రారంభించిన విద్యుత్ శాఖ సిబ్బంది.. ఎంతో కష్టపడి గ్రామంలో 63కేవీ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. ఇంటింటికి కరెంట్ సదుపాయాన్ని అందించారు.
దీంతో ఆ ప్రాంత వాసులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సౌభాగ్య పథకం కింద ఈ గ్రామానికి కరెంట్ సదుపాయం అందించినట్లు అధికారులు తెలిపారు. కాగా విద్యుత్ శాఖ అధికారులకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. వారందరిని పూలమాలలతో సత్కరించారు. అనంతరం బ్యాండ్ బాజాలతో సెలెబ్రేషన్స్ చేసుకున్నారు.