జమ్ముకశ్మీర్‌లో అలజడులు సృష్టించడమే లక్ష్యంగా ఉగ్రవాదుల దుశ్చర్యలు కొనసాగుతున్నాయి. కుల్గాంలోని వాన్పో ప్రాంతంలో స్థానికేతర కూలీలే లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడికి (Attacks in Kashmir) తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు వలస కూలీలు మరణించగా.. ఒకరు గాయపడ్డారు.
మృతి చెందిన కూలీలను రాజా రేశీ, జోగిందర్ రేశీ దేవ్‌గా అధికారులు గుర్తించారు. వీరిద్దరి స్వస్థలం బిహార్ అని తెలిపారు. చున్ రేశీ దాస్ అనే వ్యక్తి గాయపడ్డాడని వివరించారు. ఇతనికి భుజం, వెన్నుకు గాయాలయ్యాయని, ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేశారు.
కూలీలు అద్దెకు ఉంటున్న ఇళ్లలోకి చొరబడి ఉగ్రవాదులు కాల్పులు చేశారని అధికారులు తెలిపారు. ఇది.. 24 గంటల వ్యవధిలో కశ్మీరేతరులపై జరిగిన మూడో దాడి కావడం ఆందోళనకరం. తాజా దాడి అనంతరం ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఉగ్రవాదుల జాడ కోసం తనిఖీలు చేపట్టాయి.
క్యాంపులకు స్థానికేతర కూలీలు
వరుస దాడుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అన్ని జిల్లాల్లో ఉన్న స్థానికేతర కూలీలను ఒక్క చోటికి చేర్చాలని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. వారందరినీ సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు గానీ, లేదంటే సీఆర్పీఎఫ్, ఆర్మీ క్యాంపులకు కానీ తరలించాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను అత్యవసరంగా చేపట్టాలని చెప్పారు.
వరుస దాడులు
శ్రీనగర్‌లోని ఈద్గా ప్రాంతంలో ఉగ్రవాదులు శనివారం ఓ వీధివ్యాపారిని కాల్చిచంపారు. చనిపోయిన వ్యక్తిని బిహార్‌కు చెందిన అరవింద్ కుమార్‌గా గుర్తించారు.
దాదాపు అదే సమయానికి.. పుల్వామాలో జరిగిన మరో ఉగ్రదాడిలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అహ్మద్ అనే వ్యక్తి చనిపోయాడు.
గత వారంలో మైనారిటీలపై ముష్కరులు కాల్పులు జరిపిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఏరివేతను చేపట్టాయి బలగాలు. ఈ హత్యలకు పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను.. 24 గంటల వ్యవధిలో హతమార్చినట్లు పోలీసులు ప్రకటించిన తర్వాత.. ముష్కరులు మరోమారు వరుస దాడులకు పాల్పడుతున్నారు.
ఇదీ చదవండి: కశ్మీర్లో ఇద్దరు పౌరుల్ని కాల్చిచంపిన ఉగ్రవాదులు