జమ్ముకశ్మీర్‌లో గురువారం సైనిక వాహనంపై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. పూంచ్ జిల్లాలోని బాటా దొరియా ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఆ ప్రాంతంలో ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారో కనిపెట్టేందుకు డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్‌తో భద్రతా సిబ్బంది ముమ్మరంగా వెతుకుతున్నారు. సరిహద్దు జిల్లాలైన రాజౌరీ, ఫూంచ్ జిల్లాలకు అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. భింబర్ గాలి-పూంఛ్ మధ్య రాకపోకలను నిలిపివేసి వాహనాల దారి మళ్లించారు. ఘటనా స్థలాన్ని ఎన్ఐఏ బృందం వచ్చి పరిశీలించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
'ఆర్మీ వాహనంపై దాడి వారి పనే!'
సైనికులపై ఉగ్రదాడి జరిగిన రాజౌరీ-పూంచ్ సెక్టార్లో 6-7 మంది ఉగ్రవాదులు రెండు గ్రూపులుగా ఏర్పడి దాడి చేసినట్లు సమాచారం అందిందని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ఈ బృందమే గురువారం ఫూంచ్‌లో ఆర్మీ వాహనంపై దాడి చేసి.. ఐదుగురు జవాన్ల మరణానికి కారణమయ్యాయని వెల్లడించాయి. ఉగ్రవాదులు.. పాకిస్థాన్ ఉగ్రసంస్థ లష్కరే తొయిబాకు చెందినవారిగా అనుమానిస్తున్నామని తెలిపాయి.
'ఉగ్రదాడి మా పనే'
మరోవైపు.. జమ్ముకశ్మీర్‌లో సైనిక వాహనంపై దాడికి తామే పాల్పడినట్లు పాక్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ ముసుగు సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్టు ఫోర్స్ ప్రకటించింది. జీ-20 సదస్సులను కశ్మీర్‌లో నిర్వహించొద్దని హెచ్చరిస్తూ గతేడాది ఆగస్టులో పీపుల్స్ యాంటీ ఫాసిస్టు ఫోర్స్ ఓ వీడియో కూడా రిలీజ్ చేసింది. 2022 అక్టోబర్‌లో జమ్ముకశ్మీర్ జైళ్ల శాఖ డీజీపీ హేమంత్ కుమార్ లోహియా అతడి ఇంటిలోనే హత్యకు గురయ్యారు. దీనికి పీఏఎఫ్‌ఎఫ్ బాధ్యత తీసుకొంది. ప్రస్తుతం దీనిని కేంద్ర హోంశాఖ ఉగ్రసంస్థల జాబితాలో చేర్చి నిషేధించింది.
జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్-370ని తొలగించిన తర్వాత.. అక్కడి పరిస్థితి గణనీయంగా మెరుగుపడ్డాయని ప్రపంచానికి చాటేందుకు శ్రీనగర్‌లో జీ-20 సదస్సు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించడం పాక్‌కు ఏమాత్రం మింగుడుపడలేదు. పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ మే 5న భారత్‌లోని గోవాలో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సుకు హాజరు కానున్నట్లు ప్రకటించారు. ఈ సమయంలో భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగే అవకాశం కూడా ఉంది. దౌత్యపరంగా ఇంత కీలక సమయంలో భారత సైనిక వాహనంపై ముష్కరులు దాడికి తెగబడటం సంచలనంగా మారింది.
అమర వీరులు వీరే..
ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు తరలిస్తున్న రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్‌కు చెందిన సైనికుల వాహనంపై గురువారం ముష్కరులు గ్రనేడ్లతో దాడి చేయగా.. ఐదుగురు సజీవ దహనం అయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనలో హవల్దార్ మన్దీప్ సింగ్, లాన్స్ నాయక్ దేబాశిష్ బస్వాల్, లాన్స్ నాయక్ కుల్వంత్ సింగ్, హరిక్రిషన్ సింగ్, సేవక్ సింగ్ ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. చనిపోయిన ఐదుగురిలో నలుగురు సైనికులు పంజాబ్‌కు చెందినవారు కాగా లాన్స్ నాయక్ దేబాశిష్ బస్వాల్ మాత్రం ఒడిశాకు చెందిన వారు.
వీర జవాన్ ఉగ్రదాడిలో ప్రాణాలో కోల్పోవడంపై జమ్ముకశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి వారి చేసిన సేవలు మరిచిపోలేనివని అన్నారు. అమరుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. దేశంలో వివిధ రాజకీయ పార్టీలు ఉగ్రవాద చర్యను ఖండించాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జన ఖర్గే.. ఉగ్రవాద దాడిని పూర్తిగా తప్పుబట్టారు. చనిపోయిన జవాన్ల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గురువారం సాయంత్రం.. జమ్ము నగరంలోని తావి వంతెనపై విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆందోళన చేపట్టాయి. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి.
దాడి జరిగింది ఇలా..
భారత సైన్యం అధికారుల ప్రకారం.. రాష్ట్రీయ రైఫిల్స్ విభాగానికి చెందిన జవాన్లు.. రాజౌరీ సెక్టార్లో ఉగ్రవాద నిర్మూలన చర్యల్లో భాగంగా భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. గురువారం కొందరు గుర్తు తెలియని దుండగులు.. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు. వెంటనే వాహనానికి మంటలు అంటుకున్నాయి. ముష్కరులు విసిరిన గ్రెనేడ్ల కారణంగానే వ్యాన్‌లో మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఘటనపై రాజ్‌నాథ్ ఆరా..
ఈ ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడికి సంబంధించి పూర్తి వివరాలు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేను ఆయన అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు, విజిబులిటీ సరిగా లేకపోవడం వంటి పరిస్థితులను అనుకూలంగా మలుచుకున్న గుర్తు తెలియని ఉగ్రవాదులు సైనికులు వెళ్తున్న ట్రక్కును లక్ష్యంగా చేసుకొని గ్రనేడ్లతో మెరుపుదాడికి దిగారని సైనిక అధికారులు రాజ్‌నాథ్‌కు వివరించారు.