Road accident: మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్యూవీ వాహనం(జీపు)- ట్రక్కు పరస్పరం ఢీకొనగా ఏడుగురు మరణించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, తొమ్మిదేళ్ల బాలుడు ఉన్నారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. లాతూర్- అంబజోగాయీ రహదారిపై ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
లాతూర్ జిల్లాలోని సాయి, ఆర్వీ గ్రామానికి చెందిన బాధితులు అంబజోగాయీ తహసీల్‌లోని రాడీ గ్రామంలో ఓ శుభకార్యానికి హజరయ్యేందుకు వెళ్తున్నారు. వారు ప్రయాణిస్తున్న క్రూజర్‌ను (జీపు) అంబజోగాయీ నగరానికి దగ్గర్లోని నందగావ్ గ్రామానికి సమీపంలో ఎదురుగా వస్తున్న భారీ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో జీపులో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అంబజోగాయీ ఆసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలంలో మృతుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిఉండటం కంటతడి పెట్టిస్తోంది. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మృతులు నిర్మలా సోమ్వాన్షి(38), స్వాతి బోద్కే(35), శాకుంతల సోమ్వాన్షి(38), సోజర్బాయి కదమ్(37), చిత్ర షిండే(35), డ్రైవర్ ఖండు రోహిల్(35), తొమ్మిదేళ్ల బాలుడిగా గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న మహారాష్ట్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి ధనంజయ్ ముండే, సీనియర్ పోలీస్ అధికారులు ఆసుపత్రిని సందర్శించారు. బాధితుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి: రూ.100 కోసం కన్నతల్లినే చంపిన కుమారుడు