Bengaluru Shivaji statue violence: బెంగళూరులో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని కొందరు దుండగులు అపవిత్రం చేయడం ఉద్రిక్తతలకు దారి తీసింది. విగ్రహంపై సిరా చల్లిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం వల్ల.. బెళగావిలో నిరసనలు పెల్లుబికాయి.
బెంగళూరు సదాశివనగర్‌లోని సంకికేరే ప్రాంతంలో ఈ శివాజీ విగ్రహం ఉంది. గురువారం గుర్తు తెలియని దుండగులు.. విగ్రహంపై సిరా చల్లినట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్నట్లు బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ కమల్ పంత్ పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Belagavi violence shivaji statue
అయితే, ఈ ఘటనను నిరసిస్తూ హిందూ, మరాఠీ సంఘాలు శుక్రవారం అర్ధరాత్రి.. బెళగావిలోని సంభాజీ చౌక్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగాయి. వందల సంఖ్యలో కార్యకర్తలు చేరుకొని రోడ్లపై బైఠాయించారు. ఈ క్రమంలో హింస చెలరేగింది. సహనం కోల్పోయిన నిరసనకారులు.. రాందేవ్ గల్లీలో ఓ ఆటో డ్రైవర్‌ను చితకబాదారు. హుతాత్మ సర్కిల్లో ఓ పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. ఇతర ప్రభుత్వ వాహనాలే లక్ష్యంగా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఓ లాడ్జీ ముందు పార్క్ చేసిన ప్రభుత్వ వాహనాలు నిరసనకారుల చేతిలో ధ్వంసయ్యాయి. పలు వాహనాల బోర్డులను ఆందోళనకారులు తొలగించారు.
నిరసనకారులను అదుపు చేయడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. రామలింగ ఖిండి, కులకర్ణి, పాటిల్ గల్లీలలో ఆందోళనకారులపై లాఠీ ప్రయోగించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. శివాజీ విగ్రహం అపవిత్రం చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో ఆందోళకారులు ఫిర్యాదు చేశారు.
మరో విగ్రహం ధ్వంసం..
మరోవైపు, శనివారం బెళగావిలోని కనకదాస్ కాలనీలో ఓ విగ్రహం ధ్వంసమైంది. తెల్లవారుజామున 3 గంటలకు సంగోలీ రాయన్న విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో 27 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వాహనాలతో కలిపి మొత్తం 26 ప్రభుత్వ వాహనాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారని బెళగావి సిటీ కమిషనర్ త్యాగరాజన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పంచాయతీ ఆఫీస్‌లో యువతిపై పెట్రోల్ పోసి.. తానూ!