Temple Certificate Rajasthan : దక్షిణ రాజస్థాన్‌లోని ఓ దేవాలయం.. తమ కోవెలలోని కోనేరులో స్నానమాచరించిన యాత్రికుల పాపాలు తొలగిపోతాయని ఘంటాపథంగా చెబుతోంది. అంతేకాదు అలా పుణ్యస్నానం చేసిన వారికి పాప విముక్తి ధ్రువపత్రాలను కూడా అందిస్తోంది. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి రూ.12 తీసుకుంటోంది.
వాగడ్ హరిద్వార్‌గా పేరు గాంచిన గొటమేశ్వర్ మహాదేవ్ మందిర్.. రాజస్థాన్ రాజధాని జయపురకు దాదాపు 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఉంది. ఏటా ఇక్కడ గల మందాకిని కుండ్‌లో పవిత్ర స్నానం చేసిన 250 నుంచి 300 మందికి మాత్రమే పాప విముక్తి ధ్రువపత్రాలను దేవస్థానం జారీ చేస్తోంది. అయితే ఎప్పటి నుంచి ఈ ఆచారం కొనసాగుతుందన్నది తెలియరాలేదు.
"కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంపై మహమ్మద్ గజనీ దాడి చేశాడు. ఆ సమయంలో ఆలయంలోని విగ్రహాల్ని ధ్వంసం చేశాడు. శివలింగం చుట్టూ పగుళ్లు ఏర్పాడ్డాయి. పైన రంధ్రం కూడా అయింది. ఆ సమయంలో తన సైన్యం సజీవంగా తిరిగి రావాలని ప్రార్థించాడు. అది జరిగినందుకు ఆలయాన్ని మళ్లీ నిర్మించాడు."
-- వికాస్ శర్మ, పూజారి
ఏదైనా జంతువును అనుకోకుండా లేదా ప్రయత్నపూర్వకంగా చంపిన వ్యక్తులు, కుల లేదా వర్గ బహిష్కారానికి గురైన వ్యక్తులు ఆ కుండ్‌లో స్నానం చేసి పాప విముక్తి ధ్రువపత్రాన్ని పొందుతుంటారు. దానిని పంచాయతీ పెద్దలకు చూపించడం ద్వారా తాము ఎటువంటి పాప భారాన్ని మోయడంలేదని నిరూపించుకుని బహిష్కరణ శిక్ష నుంచి బయటపడుతుంటారు.
"గోహత్య శాపం నుంచి విముక్తి పొందేందుకు వివిధ ప్రదేశాల్లో తపస్సు చేయాలని గౌతమ మహర్షికి బుద్ధుడు సలహా ఇచ్చాడు. ఇక్కడ కూడా గౌతమ మహర్షి తపస్సు చేయగా.. అదే ప్రాంతంలో శివలింగం ఆవిర్భవించింది."
-- గౌతమ్, భక్తుడు
స్థానికంగా ఉండే గిరిజనులు.. మరణించిన తమ కుటుంబసభ్యుల చితాభస్మాన్ని మందాకిని కుండ్‌లో కూడా నిమజ్జనం చేస్తారని ఓ పూజారి తెలిపారు. అందుకే ఈ క్షేత్రాన్ని హరిద్వార్ ఆఫ్ వాగడ్గా పిలుస్తారన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఈ ఆలయం ఇటీవలే బాగా ప్రాచుర్యం పొందిందని సర్పంచ్ ఉదయ్ లాల్ తెలిపారు.
దేవుడికి నైవేద్యంగా సిగరెట్లు.. 'భూత్‌మామ' గుడిలో విచిత్ర పూజలు!