Telugu in Madhya Pradesh schools: ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్ విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో విద్యార్థులకు హిందీ, ఆంగ్లంతో పాటు తెలుగును బోధించాలని నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా ఇతర రాష్ట్రాల భాషలను విద్యార్థులకు బోధించనున్నట్లు మధ్యప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ తెలిపారు. తెలుగుతో పాటు మరాఠీ, పంజాబీ భాషలను సైతం విద్యార్థులకు నేర్పనున్నట్లు చెప్పారు.
Telugu teaching in Madhya Pradesh:
"మధ్యప్రదేశ్.. దేశానికి హృదయం లాంటిది. రాష్ట్ర విద్యార్థులకు తమిళం తెలిస్తే.. తమిళనాడుకు వెళ్లి వారి భాషలోనే మాట్లాడొచ్చు. హిందీ మాట్లాడే ప్రజలు తమ భాషను గౌరవిస్తారని తమిళనాడు ప్రజలు భావిస్తారు. తద్వారా హిందీ భాషకూ గౌరవం పెరుగుతుంది. భాషా వ్యతిరేకత క్రమంగా తగ్గుతుంది."
-ఇందర్ సింగ్ పర్మార్, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి
Telugu in MP schools:
దేశంలోని ఇతర రాష్ట్రాల భాషల గురించి విద్యార్థులకు అవగాహన ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు పర్మార్. 52 జిల్లాల్లోని ఎంపిక చేసిన 53 పాఠశాలల్లో తెలుగు, పంజాబీ, మరాఠీ భాషలను బోధిస్తామని పేర్కొన్నారు.
మాతృభాషలో వృత్తి విద్యా కోర్సులు
మధ్యప్రదేశ్లో ఇంజినీరింగ్ విద్యను హిందీలో బోధించాలని అక్కడి సర్కారు ఇదివరకే నిర్ణయించింది. వైద్య విద్యను సైతం హిందీలో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. దీనిపై రిపబ్లిక్ డే ప్రసంగంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటన చేశారు. వృత్తి విద్యా కోర్సులను సైతం మాతృభాషలో బోధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: 'మాతృభాషలో విద్యాబోధనతో చిన్నారుల్లో మానసికాభివృద్ధి'