Pending Bills Issue in Telangana : పెండింగ్‌లో ఉన్న బిల్లులపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు 3 బిల్లులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. అందులో ఒక బిల్లును తిరస్కరిస్తూ వెనక్కు పంపిన గవర్నర్ .. మిగిలిన రెండు బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరారు. డీఎంఈ సహా వైద్య విద్యలో పాలనాపరమైన పోస్టుల పదవీ విరమణ వయస్సు పెంపునకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లును గవర్నర్ తిరస్కరించారు.
Tamilisai Rejects DMO retirement age bill : పురపాలికల్లో అవిశ్వాస గడువును మూడు నుంచి నాలుగేళ్లకు పొడిగింపు, కో-ఆప్షన్ సభ్యుల సంఖ్య పెంపునకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లుతో పాటు కొత్తగా మరికొన్ని ప్రైవేట్ విశ్వ విద్యాలయాలకు అనుమతిస్తూ చట్ట సవరణ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. తన వద్ద పెండింగ్‌లో ఉన్న మూడు బిల్లులపై గవర్నర్ నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుతం రాజ్‌భవన్‌లో ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేనట్లైంది. ఈ మేరకు ఇవాళ సుప్రీంకోర్టుకు ఇదే అంశాన్ని నివేదించనున్నారు.
ఉభయ సభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మొత్తం పది బిల్లుల్లో గత విచారణ సందర్భంగా మూడు బిల్లులను ఆమోదించినట్లు, రెండింటిని రాష్ట్రపతికి పంపినట్లు, మరో రెండింటిపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం కోరినట్లు రాజ్ భవన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరో మూడు గవర్నర్ పరిశీలనలో ఉన్నట్లు అప్పట్లో పేర్కొన్నారు. తాజాగా ఇవాళ మరోమారు విచారణ ఉన్న తరుణంలో మూడింటిపైనా గవర్నర్ తమిళిసై నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం గవర్నర్ వద్ద ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేనట్లైంది.
గతంలో ఆమోదించిన బిల్లులు ఇవీ..: పెండింగ్ బిల్లులకు సంబంధించి సుప్రీంకోర్టులో గత విచారణ సందర్భంగా గవర్నర్ తమిళిసై మోటారు వాహనాల పన్ను చట్టసవరణ బిల్లు, పురపాలక చట్ట సవరణ బిల్లు, వ్యవసాయ విశ్వ విద్యాలయ చట్ట సవరణ బిల్లులకు ఆమోద ముద్ర వేశారు. అజమాబాద్ పారిశ్రామిక చట్ట సవరణ బిల్లు, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లులపై అభిప్రాయం చెప్పాలని రాష్ట్ర న్యాయశాఖను కోరారు. విశ్వ విద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు ఏర్పాటు బిల్లు, అటవీ విశ్వ విద్యాలయం బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. మిగతా మూడు బిల్లులు తన వద్ద పెండింగ్‌లో ఉండగా.. వాటిపై నేడు నిర్ణయం తీసుకున్నారు.
ఇవీ చూడండి..