Telangana Schools start from June 12 : 2023-24 పాఠశాల విద్యా సంవత్సరం షెడ్యూల్ను తెలంగాణ విద్యాశాఖ ఖరారు చేసింది. జూన్ 12 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమై.. ఏప్రిల్ 24 చివరి పని దినంగా ప్రకటించింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 తేదీ వరకూ వేసవి సెలవులు కాగా.. 2023-24 ఏడాదిలో మొత్తం 229 పనిదినాలు ఉండనున్నాయి. జనవరి 10 తేదీ లోపు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాల్సి ఉంటుందని విద్యాశాఖ కార్యదర్శి కరుణ వాటిక తెలిపారు.
- రాష్ట్రంలో 45 శాతం హైస్కూళ్లలో ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుల పాలన
- అద్దె భవనాల్లో సర్కారు పాఠశాలలు.. మన బస్తీకి సొంత బడి వచ్చేనా?
మార్చిలో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పాఠశాలల్లో ప్రతీ రోజూ విద్యార్థులకు ఐదు నిమిషాల పాటు యోగ, ధ్యానం తరగతులు ఉంటాయన్నారు. అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు, జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు, డిసెంబర్ 22 నుంచి 26 తేదీ వరకూ క్రిస్మస్ సెలవులు ఉంటాయని ప్రకటించారు. ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వారికి ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
కొత్త విద్యాసంవత్సరం అనేక సవాళ్లు: మరో వారం రోజుల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతోంది. దీంతో పిల్లలు, ఉపాధ్యాయులు స్కూల్కు పరుగులు తీయబోతున్నారు. కానీ ఎప్పుడు కనిపించే సమస్యలే ఈ సారి చాలా పాఠశాలలో వారికి దర్శనం ఇవ్వబోతున్నాయి. చాలా స్కూల్లో మంచినీటి సమస్యలు, బోధించడానికి సరిపడే అదనపు తరగతి గదుల కొరత బాగా కనిపిస్తున్నాయి. అక్కడక్కడ పాఠశాల ఆవరణలో ఉండే వటవృక్షాలే తరగతి గదులు అయిన సందర్భాలు లేకపోలేదు. ముఖ్యంగా ఉపాధ్యాయుల కొరత విద్యాశాఖను బాగా వేధిస్తోంది.
బడులు బాగుంటేనే బాలలకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. బంగారు తెలంగాణాలో వేలాది ప్రభుత్వ పాఠశాలలు ఒక్క ఉపాధ్యాయుడితోనే నెట్టుకొస్తున్నాయి. ఏకోపాధ్యాయ బడులు దేశంలో సగటున పది శాతం ఉంటే తెలంగాణలో 21శాతం వరకు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఒకటి నుంచి ఐదు తరగతులకు ఒక్క టీచరే బోధించాలి. ఇవికాక బోధనేతర బాధ్యతలు కూడా తానే చూసుకోవాలి. ఉన్న ఒక్క టీచరూ అనారోగ్యమనో, అవసరమయ్యో సెలవు పెడితే... ఆ బడికి అనధికారిక సెలవే. చాలా చోట్ల ఇదే పరిస్థితి. దానివల్ల పిల్లల చదువులు అటకెక్కుతున్నాయి. ఇప్పటికైన ప్రభుత్వం వీటిపై దృష్టి సారించి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య పెంచాలని పిల్లలు, వారి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.
ప్రైవేట్ బడులపై పర్యవేక్షణ ఏది?: ప్రస్తుతం విద్యావ్యవస్థలో ప్రైవేట్ పాఠశాలలు రాజ్యమేలుతున్నాయి. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడంతో నిబంధనలకు విరుద్ధంగా చాలా బడులు నడిపిస్తున్నారు. అంతే కాకుండా ఫీజుల పేరుతో అధిక మొత్తంలో వసూళ్లు పర్వం కొనసాగిస్తున్నారు. మరోవైపు స్కూల్లు ఇన్ని రోజులు మూతపడటంతో విద్యార్థులను తీసుకెళ్లే వాహనాలు కూడా సరిగ్గా నిర్వహణ లేక మూలన కూర్చున్నాయి. ఇప్పుడు తొందర తొందరగా అవి తీయడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రవాణాశాఖ అధికారులు వీటిపై దృష్టి పెట్టాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.
ఇవీ చదవండి: