Bandi Sanjay releases from Karimnagar prison: పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎంపీ బండి సంజయ్ జైలు నుంచి విడుదలయ్యారు. నిన్న రాత్రి బెయిల్ మంజూరు కావడంతో జైలు అధికారులు ఆయన్ను విడుదల చేశారు. సంజయ్ విడుదల నేపథ్యంలో కరీంనగర్‌లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో 144 సెక్షన్ విధించారు. సాయంత్రం 4 గంటల వరకు దుకాణాలు మూసివేయాలని పోలీసులు ఆదేశించారు. భారీ బందోబస్తు మధ్య జైలు నుంచి బయటికి వచ్చిన సంజయ్.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లు లీకేజీ చేయించి ఆ వ్యవహారాన్ని పక్కదోవ పట్టించేందుకే కుట్రపూరితంగా పదో తరగతి ప్రశ్నాపత్రాల అంశాన్ని తెరమీదకు తెచ్చారని ఆయన ఆరోపించారు.
టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కుమారుడిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. పరీక్షలు రాసే అభ్యర్థులకు రూ.లక్ష సాయం చేయాలని కోరారు. పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం ఎవరైనా లీక్ చేస్తారా.. అని ప్రశ్నించారు. ముందురోజు పదోతరగతి తెలుగు ప్రశ్నపత్రం ఎవరు లీక్ చేశారని నిలదీశారు. పదోతరగతి పత్రాల లీక్ ఘటనను కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపే దమ్ముందా అని బండి సంజయ్ సవాల్ చేశారు. వరంగల్ సీపీకి.. పేపర్ లీక్‌కు.. మాల్ ప్రాక్టీస్‌కు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. త్వరలో వరంగల్‌లో నిరుద్యోగ యువతతో భారీ ర్యాలీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
"ఎంపీ పట్ల పోలీసుల ప్రవర్తన దారుణంగా ఉంది. పోస్టులు, పైసలు కోసమే పోలీసులు పనిచేస్తున్నారు. కొందరు పోలీసు అధికారుల తీరుపై కిందిస్థాయి పోలీసులు బాధపడుతున్నారు. 20 మార్కులకు పాసయ్యే హిందీ పేపర్‌ను ఎవరైనా లీక్ చేస్తారా..? కేసీఆర్ కుమారుడిపై పీడీ యాక్ట్ పెట్టాలి. తెలంగాణ ఉద్యమంలో 1,400 మంది చనిపోయేందుకు కారకులు ఎవరు? లిక్కర్, డ్రగ్స్ దందా ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసు. 30 లక్షల మంది యువత భవిష్యత్తును నాశనం చేస్తే ప్రశ్నించకూడదా?" - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
కేసీఆర్ ఇచ్చిన హామీలపై ప్రశ్నించిన వారికి పిచ్చి అంటారని బండి సంజయ్ అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారంతా పిచ్చివాళ్లని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాగు, తాగించు అనేదే బీఆర్ఎస్ ప్రభుత్వ విధానమని విమర్శించారు. కేసీఆర్ కుమారుడు, కుమార్తె జైలుకు పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. కేసీఆర్ కుట్రలు, కుతంత్రాలు, అవినీతిని ప్రజలంతా గ్రహించారని.. కేసీఆర్ కుటుంబ పాలన, దోపిడీ, అరాచకాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. పోలీసులు, స్టేషన్లు, జైళ్లు, లాఠీలు.. తమకు కొత్త కాదన్న బండి సంజయ్.. కేంద్రం ఇస్తున్న నిధులను కేసీఆర్ దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు.
'బీజేపీ సంఘటిత శక్తి ఏమిటో రేపు మోదీ సభలో చూపిద్దాం. రేపు ఉదయం 10.30 గం.కు పరేడ్ గ్రౌండ్‌కు తరలిరావాలని కోరుతున్నా. నా పాత్ర ఏమీ లేదు.. నా పిల్లలపై ప్రమాణం చేస్తున్నా. లీకేజ్, మాల్ ప్రాక్టీస్‌లో నా పాత్ర ఉందని సీపీ ప్రమాణం చేయాలి. లక్షలమంది పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంటే సీఎం ఏం చేస్తున్నారు?' - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
బండి సంజయ్‌కు కేంద్ర పెద్దలు ఫొన్: బెయిల్‌పై విడుదలైన బండి సంజయ్‌కు ఆ పార్టీ పెద్దలు ఫొన్ చేశారు. బీఆర్ఎస్ కుట్రలను ఛేదిద్దామని బండి సంజయ్‌తో అన్నారు.ప్రజా సమస్యలపై ఉద్ధృతంగా పోరాడాలని సూచించారు. జాతీయ నాయకత్వమంతా అండగా ఉంటుందని సంజయ్‌కు భరోసా ఇచ్చారు. ఫోన్ చేసిన వారిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు స్మృతి ఇరానీ, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ ఉన్నారు.
ఇవీ చదవండి:
వాట్సప్‌లో మెసేజ్‌లు వస్తే పోలీసు విచారణకు పిలవటం దుర్మార్గం: కిషన్‌రెడ్డి
పదో తరగతి ప్రశ్నపత్రాల కేసు.. ఈటల రాజేందర్‌కు నోటీసులు
రేపు హైదరాబాద్‌కు ప్రధాని నరేంద్ర మోదీ.. ఏర్పాట్లలో బీజేపీ నేతలు బిజీబిజీ