Telangana Assembly Monsoon Sessions August 2023 : తెలంగాణలో శాసన సభ, శాసన మండలి వర్షాకాల సమావేశాలు వచ్చే నెల మూడో తేదీ నుంచి జరగనున్నాయి. సమావేశాల నిర్వహణపై ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 12వ తేదీన ముగిశాయి. ఆర్నెళ్ల గడువు ప్రకారం ఆగస్టు 11లోపు ఉభయసభలు తిరిగి సమావేశం కావాల్సి ఉంది. దీంతో మూడో తేదీ నుంచి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇవే చివరి సమావేశాలు అయ్యే అవకాశం ఉంది. దీంతో ఎన్నికలే లక్ష్యంగా ఈ సమావేశాల్లో వివిధ అంశాలపై చర్చ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలపై ప్రకటన చేసే అవకాశం ఉంది. కొత్త బిల్లులు సహా గవర్నర్ తిప్పి పంపిన బిల్లులపై కూడా ఉభయసభల్లో చర్చించే అవకాశం ఉంది.
వ్యూహాలు రచిస్తోన్న ప్రతిపక్షాలు: ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షాలు వ్యూహాలతో సిద్ధమైపోయాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ప్రధానంగా నెలకొన్న సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తనున్నాయి. రాష్ట్రాన్ని చిగురుటాకులా వణికిస్తున్న భారీ వరదల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన సహాయక చర్యల అంశం, జీహెచ్ఎంసీ అభివృద్ధి.. ఇలా చాలా అంశాలు చర్చకు రానున్నాయి. ఎన్నికలకు ముందు ఈ సమావేశాలే చివరి సమావేశాలు అవ్వడం వలన మంత్రుల అవినీతి, ఓఆర్ఆర్ టెండర్ అంశాలు ఇలా పలు అంశాలు ఉభయ సభల్లో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి సమావేశాలు హాట్‌హాట్‌గా నడుస్తాయని అంచనా వేస్తున్నారు.
ప్రతి వ్యూహాలతో సిద్ధమైన అధికార పక్షం: ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పికొట్టే విధంగా అధికార బీఆర్ఎస్ కూడా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వచ్చిన వర్షాలు.. వాటి వల్ల సంభవించిన వరదలు.. ఇంకా ఇతర అంశాలపై చర్చించేందుకు ఈ నెల 31న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశాల్లో దాదాపు 40 నుంచి 50 అంశాల మీద మంత్రి వర్గం చర్చించనుందని టాక్. అలాగే రాష్ట్రంలో సంభవించిన భారీ వరదలు, నష్టాలపై కూడా చర్చించి.. పలు నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది.
Telangana Assembly Monsoon Sessions 2023 : వరదల వల్ల జరిగిన పంట నష్టాల వివరాలు.. అలాగే ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలు మంత్రివర్గంలో చర్చకు రానున్నాయి. రోడ్లు, రవాణా మార్గాల పునరుద్ధరణ చర్యలపై కేబినెట్లో చర్చించనున్నారు. అలాగే రాజకీయ అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని టాక్ వినిపిస్తోంది. వచ్చే నెల 3వ తేదీ నుంచి వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఉభయ సభల్లో ఏయే బిల్లులు పెట్టాలి అనే దానిపై చర్చించనున్నారు. అలాగే ప్రతిపక్షాల వ్యూహాలను ఎలా ఎదుర్కొనాలి అనే దానిపై ఈ కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఇవీ చదవండి: