ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్.. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని కలిశారు. బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ, ఆర్జేడీ పొత్తు కుదుర్చుకుంటాయన్న ఊహాగానాల నేపథ్యంలో వీరి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. బంగాల్ సచివాలయంలో సీఎం మమతాతో భేటీ అయిన తేజస్వీ.. బంగాల్లోని లౌకిక పార్టీలు అన్ని ఐక్యం కావాలన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీకి ఓటు వేయాలని బంగాల్ నివసిస్తున్న బిహారీలను కోరారు. బంగాల్‌లో భాజపా అధికారంలోకి రాకుండా చేయడమే తమ ప్రధాన ఉద్దేశమన్న తేజస్వీ.. దీదీకి మద్దతు ఇవ్వాలన్నది లాలూజీ నిర్ణయం అని పేర్కొన్నారు.
దీదీ హర్షం
ఆర్జేడీ మద్దతుపై మమత హర్షం వ్యక్తం చేశారు. భాజపాకు వ్యతిరేకంగా తేజస్వీతో పాటు తామూ పోరాడుతామని దీదీ పేర్కొన్నారు.
బిహార్‌లో ఎన్డీఏకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన కూటమికి నేతృత్వం వహిస్తున్న తేజస్వీ యాదవ్.. బంగాల్‌లో తృణమూల్‌తో కలిసి పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు మౌనం వహించారు.
హస్తంతో దోస్తీ బిహార్ వరకే..
లెఫ్ట్, కాంగ్రెస్‌తో పొత్తు బిహార్ వరకే పరిమితమని, బంగాల్‌లో భాజపాను నిలువరించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. బంగాల్‌లో ఉంటోన్న బిహార్ ప్రజలు తెలివిగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. భాజపా నేతలంతా తమ పనిని పక్కనబెట్టి బంగాల్ బాట పడుతున్నారని తేజస్వీ యాదవ్ ఎద్దేవా చేశారు.
ఇదీ చూడండి: బంగాల్‌లో 8 దశల పోలింగ్‌పై సుప్రీంలో పిటిషన్