Technical Problem in CM KCR Helicopter : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరకద్ర ప్రజా ఆశీర్వాద సభకు వెళ్తుండగా.. సాంకేతిక సమస్య రావడంతో పైలట్ అప్రమత్తమయ్యారు. వెంటనే హెలికాప్టర్‌ను వెనక్కి మళ్లించి ఎర్రవల్లిలోని సీఎం వ్యవసాయ క్షేత్రంలో ల్యాండింగ్ చేశారు. దీంతో ఏవియేషన్ సంస్థ ప్రత్యామ్నాయ హెలికాప్టర్‌ను ఏర్పాటు చేయనుంది. మరో హెలికాప్టర్ రాగానే కేసీఆర్ పర్యటన యధావిధిగా కొనసాగనుంది.
దీపావళి తర్వాత సీఎం కేసీఆర్ మూడో విడత ఎన్నికల ప్రచారం - ఈసారి ఏకంగా రోజుకు 4 నియోజకవర్గాల్లో సభలు
నేడు 4 సభల్లో కేసీఆర్ ప్రసంగం..: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితి.. ప్రచారంలోనూ దూసుకుపోతోంది. అభ్యర్థులు ఎక్కడికక్కడ ప్రచారాలు చేస్తుండగా.. పార్టీ అధినేత ప్రజా ఆశీర్వాద సభలో పేరిట అభ్యర్థులకు మద్దతుగా బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ వారిలో ఉత్సాహం నింపుతున్నారు. రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ సభలకు హాజరవుతున్నారు. సీఎం కేసీఆర్ నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 4 ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, గద్వాల్‌ల్లో నిర్వహించే సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. మొదటగా దేవరకద్ర సభలో పాల్గొననున్న సీఎం.. తర్వాత గద్వాల, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లో నిర్వహించే సభలకు హాజరవుతారు. అధినేత పర్యటనతో నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
తొమ్మిదిన్నరేళ్ల ప్రగతే లక్ష్యంగా బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచార జోరు
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని మేళ్ల చెరువు చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ సభకు సుమారు లక్ష మంది వరకు జనాభా వస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సభా ప్రాంగణంలో 50 వేల కుర్చీలు ఏర్పాటు చేశామన్నారు. 300 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారిన అసంతృప్తులు - కొనసాగుతున్న బుజ్జగింపులు
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దీంతో బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పరిశీలించి.. అధికారులు, నాయకులకు పలు సూచనలు చేశారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో రానున్న సీఎం కేసీఆర్ కోసం అధికారులు హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.