ఉత్తర్‌ప్రదేశ్ హర్దోయిలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యాయుడు కొట్టిన దెబ్బలు తాళలేక 14 ఏళ్ల ఎస్సీ బాలుడు మరణించాడు. 38 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. పరిస్థితి విషమించి శనివారం కన్నుమూశాడు. ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాన్ని ఖననం చేసేందుకు నిరాకరించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇదీ జరిగింది
సుమెర్పుర్కు చెందిన 14 ఏళ్ల అజయ్ కుమార్ ఏడో తరగతి చదువుతున్నాడు. సెప్టెంబర్ 20న రోజూలాగే తరగతులకు వెళ్లగా.. ఉపాధ్యాయుడు ప్రదీప్ కుమార్ ద్వివేది అకారణంగా చితకబాదాడు. తిరిగి ఇంటికి వెళ్లిన అజయ్ కుమార్ నొప్పులతో బాధపడ్డాడు. రోజురోజుకు ఆరోగ్యం క్షీణించడం వల్ల లఖ్‌నవూలోని బలరాంపుర్ ఆస్పత్రిలో చేర్పించారు. 38 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అజయ్ కుమార్ పరిస్థితి విషమించి శనివారం మరణించాడు.
ఇంటికి వచ్చిన అజయ్ నొప్పులతో బాధపడ్డాడని.. ఆహారం, నీరు సైతం తీసుకోలేక ఇబ్బంది పడ్డాడని అతడి అత్త తెలిపింది. కారణం అడగాగా.. టీచర్ దారుణంగా కొట్టాడని, బయట ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడని ఆమె చెప్పింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసినా పట్టించుకోవడం లేదని.. తమకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇవీ చదవండి: తీగల వంతెన విషాదం.. భాజపా ఎంపీ కుటుంబంలో 12 మంది మృతి
పెట్రోల్ బంక్‌లో చోరీకి యత్నించిన దుండగుడిని కాల్చి చంపిన సెక్యూరిటీ గార్డు