TDP Motha Mogiddam Program: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ.. ఆ పార్టీ అధిష్ఠానం బాబుకు మద్దతు పేరుతో పిలుపునిచ్నిన 'మోత మోగిద్దాం' కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా దద్ధరిల్లింది. ఆ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వేలాదిమంది యువత 'మోత మోగిద్దాం' కార్యక్రమంలో పాల్గొని.. చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. అన్ని జిల్లాల్లో ఉన్న పార్టీ కార్యాలయాల్లో, పల్లెల్లో, నగరాల్లో.. పళ్లాలు, డప్పులు, ఈలలు, హారన్ల శబ్దాలతో 'మోత మోగిద్దాం' కార్యక్రమం మోత మోగింది.
Motha Mogiddam Program: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ 'మోత మోగిద్దాం' కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి 7 గంటన నుంచి 7.05 వరకు 5 నిమిషాల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్‌కు వినిపించేలా ఏదో ఒక రకంగా మోత మోగించాలని.. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, నారా బ్రాహ్మణిలు పిలుపునిచ్చారు. పిలుపులో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో రోడ్లపైకి వచ్చి టీడీపీ శ్రేణులు మోత మోగించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. పళ్లాలు, డప్పులు, ఈలలు, హారన్ల శబ్దాలతో 'మోత మోగిద్దాం' కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
TDP Leaders Participated in the Motha Mogiddam Program: రాజమహేంద్రవరంలో 'మోత మోగిద్దాం' కార్యక్రమంలో పాల్గొన్న నారా బ్రాహ్మణి.. విజిల్ ఊది, డప్పు కొట్టి నిరసన తెలిపారు. దిల్లీలో ఉన్న నారా లోకేశ్ 'మోత మోగిద్దాం' కార్యక్రమంలో పాల్గొని.. 5 నిమిషాలపాటు గంట మోగించి నిరసన తెలిపారు. మరోవైపు టీడీపీ కేంద్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్ వద్ద నిర్వహించిన 'మోత మోగిద్దాం' కార్యక్రమంలో వందలాదిమంది పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని గంటలు, పళ్లాలు, డప్పులతో చంద్రబాబుకు మద్దతు తెలిపారు. హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడి నివాసంలో డ్రమ్స్ కొట్టి 'మోత మోగిద్దాం' కార్యక్రమాన్ని నారా భువనేశ్వరి ప్రారంభించి..పూర్తి మద్దతును ప్రకటించారు.
Nara Lokesh Comments: మరోవైపు రాష్ట్రయేతర ప్రాంతాలైనా.. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో 'మోత మోగిద్దాం' కార్యక్రమంలో పాల్గొన్న నేతలు చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ..'' వచ్చే నెల 4న సీఐడీ విచారణకు హాజరవుతా. జగన్‌లాగా నేను వాయిదాలు అడగను. కక్షసాధింపు తప్ప ఎలాంటి ఆధారాలు కేసులు ఇవన్నీ. అజేయ కల్లం, ప్రేమ్‌చంద్రారెడ్డి పేర్లు ఎందుకు లేవో సీఐడీ చెప్పాలి. 'మోత మోగిద్దాం' కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు ప్రజలందరికీ ధన్యవాదాలు.'' అని ఆయన అన్నారు. అక్టోబరు 2న జైలులో చంద్రబాబు దీక్ష చేపట్టనున్నారని.. అచ్చెన్నాయుడు వెల్లడించారు. తనకు జరిగిన అన్యాయంపై గాంధీ జయంతి రోజు చంద్రబాబు దీక్ష చేస్తారని ఆయన పేర్కొన్నారు.
LIVE: మోత మోగిద్దాం! కార్యక్రమంలో పాల్గొన్న నారా బ్రాహ్మణి.. ప్రత్యక్ష ప్రసారం