TDP Jaganasura Dahanam Program in AP: దేశం చేస్తోంది రావణాసుర దహనం-మనం చేద్దాం జగనాసుర దహనం అంటూ.. తెలుగుదేశం చేపట్టిన నిరసన కార్యక్రమంలో రాజమహేంద్రవరంలో.. లోకేశ్, బ్రాహ్మణి పాల్గొన్నారు. సైకో పోవాలి అని రాసి ఉన్న పత్రాలను మంటల్లో వేసి దహనం చేశారు. కార్యక్రమంలో... తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా పాల్గొన్నారు.
వైకాపా ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తూ ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా తెదేపా శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద తెదేపా నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు, మంగళగిరి, అచ్చంపేట, పిడుగురాళ్లలో నిరసన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకున్నారు. రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు, దొండపాడుతో పాటు దుగ్గిరాలలోనూ రైతులు, మహిళలు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రొంపిచర్ల మండలం కర్లగుంటలో బైక్ ర్యాలీ చేపట్టారు. బాపట్ల జిల్లా అద్దంకి, చీరాల నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో ఆందోళనలు చేపట్టారు.
కృష్ణా జిల్లా బంటుమిల్లిలో సైకో పోవాలంటూ నినాదాలు చేస్తూ కర పత్రాలను మంటల్లో వేసి కాల్చారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలంటూ అవనిగడ్డలో ఆందోళన చేశారు. కోడూరు, నాగాయలంక, చల్లపల్లి, మోపిదేవి, ఘంటసాల మండలాల్లో తెదేపా, జనసేన నాయకులు, కార్యకర్తలు రావణాసుర దహనం-మనం చేద్దాం జగనాసుర దహనం కార్యక్రమాన్ని నిర్వహించారు. నియంతపై పోరాటం అంటూ మొవ్వలో ఆందోళన చేశారు. జగ్గయ్యపేట , తాడిగడప, గన్నవరం, ప్రసాదంపాడులో కరపత్రాలను దహనం చేసి నిరసన తెలిపారు.
కోనసీమ జిల్లా అంబాజీపేటలో సైకో పోవాలి అంటూ రాసి ఉన్న పత్రాలను దహనం చేసి నిరసన తెలిపారు. అమలాపురం, రాజోలు, పి.గన్నవరం, రావులపాలెం, ముమ్మిడివరం తదితర ప్రాంతాల్లో సైకో పోవాలి అంటూ రహదారులపై ప్లకార్డులను దహనం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం మల్లేశ్వరంలో, ఉండ్రాజవరం మండలం వెలగదుర్రు ప్రజలు మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో నిరనస కార్యక్రమం నిర్వహించారు.
ఏలూరులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో జగనాసుర వధ కార్యక్రమం చేపట్టారు. నిరసన కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును ఖండిస్తూ తెదేపా నేతలు పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు, తెదేపా నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో జగనాసుర వధ సైకో పోవాలి ప్రతులను దహనం చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సైకో పాలన పోవాలని నిరసన తెలిపారు. పాలకొండ, కురుపాంలో కరపత్రాలను దగ్ధం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు..
విశాఖలో తెలుగుదేశం నాయకురాలు గౌతు శిరీష తన కుటుంబంతో కలిసి నిరసన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పాలవలసలో తెదేపా సీనియర్ నేతకూన రవి కుమార్ ఆధ్వర్యంలో జగనాసుర దహనం కార్యక్రమాన్ని చేపట్టారు. జి.సిగడాం మండలం మెట్టవలస పంచాయతీ పాలఖండ్యాం కూడలిలో "మనం చేద్దాం-జగనాసుర దహనం" నిర్వహించారు. కవిటిలో ఎమ్మెల్యే అశోక్ ఆధ్వర్యంలో దహన కార్యక్రమం చేపట్టారు. ఇచ్ఛాపురంలో నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. కృష్ణపేటలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు గొండు శంకర్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీకాకుళంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిని గృహ నిర్బంధం చేయడంతో ఆమె ఇంటివద్దే నిరసన తెలిపారు. నరసన్నపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆందోళనలో పాల్గొన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు అడ్డుకోవడం తగదని రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో MLA కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్ది ఆధ్వర్యంలో జగనాసుర దహనం కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు, ఆత్మకూరులో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. వెలిగండ్ల, పెద్ద చెర్లోపల్లి, చంద్రశేఖరపురం మండల కేంద్రాల్లో సైకో పోవాలి అంటూ నినాదాలు చేస్తూ జగనాసుర దహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత నిరసన తెలపకుండా పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో ర్యాలీ నిర్వహించారు. రాయచోటి, రాజంపేటలోప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
హిందూపురంలో కరపత్రాలను మంటల్లో వేసి దహనం చేశారు. కదిరి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు, నాయకులు రహదారులపై నిరసన ప్రదర్శన చేపట్టారు. పెనుకొండలో తెదేపా శ్రేణులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో, తిరుపతిలో తెదేపా నాయకులు, ఎంఆర్‌పల్లిలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో నాయకులు ర్యాలీ చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ తెదేపా కార్యాలయంలో జగనాసుర కరపత్రాలను దహనం చేశారు. అనంతపురంలో జగనాసుర దహనం కార్యక్రమంలో మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. రాప్తాడు నియోజకవర్గం వెంకటాపురంలో మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గం తెదేపా బాధ్యుడు పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కళ్యాణదుర్గం, బెలుగుప్ప మండలం దుద్దేకుంటలో పార్టీ నేతలు ఆందోళనలు నిర్వహించారు.
YSR జిల్లా పులివెందుల నియోజకవర్గ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కడప, మైదుకూరు, కాజీపేట మండల కేంద్రాల్లో రహదారుల పైకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు కరపత్రాలను దహనం చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాజీ కేంద్రమంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో జగనాసుర దహనం కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు, ఆదోని, పాణ్యం, నంద్యాలలో నిరసనలు చేపట్టారు..