కదులుతున్న కంటెయినర్లో నుంచి దొంగతనాలు చేసే సన్నివేశాలు.. సినిమాల్లో చూస్తుంటాం. ఇదే తరహాలో.. తమిళనాడులో ఓ దొంగల ముఠా రెచ్చిపోయింది.
ఏం జరిగిందంటే..?
తమిళనాడులోని క్రిష్ణగిరిలో రూ.6 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లతో వెళ్తున్న ట్రక్కును అడ్డగించి నిమిషాల వ్యవధిలో వాటిని దోచుకెళ్లింది ఓ ముఠా. కాంచిపురంలోని ఓ మొబైల్స్ తయారీ ఫ్యాక్టరీ నుంచి సెల్ఫోన్లను, కర్ణాటకలోని కోలార్‌కు తరలిస్తుండగా ఈ దొంగతనం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ట్రక్కు హోసూర్ నుంచి కర్ణాటక సరిహద్దులోని దేవరాయ సముద్రానికి దగ్గర్లో ఉండగా గుర్తుతెలియని దొంగల ముఠా వాహనాన్ని అడ్డగించినట్లు పోలీసులు తెలిపారు. ట్రక్కులోని డ్రైవర్, అతడి సహాయకుడిపై దాడి చేసి రూ.6కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లినట్లు చెప్పారు. రహదారిపై ఉన్న సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
గతంలోనూ..
గతేడాది అక్టోబర్‌లో రూ.15 కోట్ల విలువైన సెల్ఫోన్లను ఇదే తరహాలో దోచుకోగా.. ఆ కేసులో నిందితులైన 10 మందిని మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌ల్లో హోసూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇదే ముఠా ఆంధ్రప్రదేశ్‌లోనూ కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను దోచుకుందని పోలీసులు తెలిపారు.
తమిళనాడు-కర్ణాటక సరిహద్దుల్లో ఈ తరహా దొంగతనాలు పెరుగుతున్నందున.. ఇరు రాష్ట్రాల పోలీసులు సెల్‌ఫోన్ దోపిడీ ముఠాను గుర్తించే పనిలో పడ్డారు.
ఇవీ చదవండి: