Tamilnad Mercantile Bank 9000 Crore : తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో ఎస్ కృష్ణన్.. తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను బ్యాంక్ బోర్డు గురువారం ఆమోదించింది. అనంతరం రిజర్వ్ బ్యాంక్‌కు ఆయన లేఖను ఫార్వార్డ్ చేసింది. ఇటీవలే ఈ బ్యాంక్‌లో ఖాతా ఉన్న ఓ క్యాబ్ డ్రైవర్‌కు రూ.9వేల కోట్లు జమైన వారం రోజులకే కృష్ణన్ రాజీనామా చేయడం గమనార్హం.
Tamilnad Mercantile Bank MD And CEO : గతేడాది సెప్టెంబర్ 4న కృష్ణన్.. బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు మూడింట రెండు వంతుల పదవీకాలం ఉన్నప్పటికీ, వ్యక్తిగత కారణాలను చూపుతూ ఆయన తన రాజీనామాను సమర్పించారు. "నేను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. అయితే, బ్యాంక్‌కు ఒకే ఒక్కరు పూర్తి సమయం డైరెక్టర్‌గా ఉన్నందున, ఈ విషయంలో నేను ఆర్‌బీఐ మార్గదర్శకత్వాన్ని కోరుతాను" అని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
క్యాబ్ డ్రైవర్ ఖాతాలో రూ.9వేల కోట్ల సంగతేంటి?
Cab Driver Get 9000 Crore : వారం రోజుల క్రితం.. పళని నెయ్కారాపట్టికి చెందిన రాజ్‌కుమార్ అనే వ్యక్తి ఖాతాలో ఉన్నట్టుండి అక్షరాల రూ.9 వేల కోట్లు జమ అయ్యాయి. కారును రెంట్‌కు తీసుకొని నడిపిస్తున్న రాజ్‌కమార్ ఫోన్‌కు సెప్టెంబర్ 9న మధ్యాహ్నం 3 గంటల సమయంలో తూత్తుకూడి జిల్లాలోని తమిళనాడు మెర్కంటైల్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం నుంచి ఓ సందేశం వచ్చింది. అందులో రాజ్‌కుమార్ ఖాతాలోకి ఏకంగా రూ.9 వేల కోట్లు డిపాజిట్ అయినట్లుగా మెసేజ్ ఉంది. కేవలం రూ.15లు ఉన్న తన బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తం ఎవరు జమ చేసి ఉంటారని రాజ్‌కుమార్ అనుకున్నాడు.
అయితే ఆ మెసేజ్ నిజమో కాదో అని తెలుసుకునేందుకు.. తన స్నేహితుడికి అప్పుగా ఇవ్వాల్సిన రూ.21 వేలను అతడికి పంపించి చూశాడు. ఆ లావాదేవీ సక్సెస్ అయింది. ఆ తర్వాత కాసేపటికే రాజ్‌కుమార్‌కు సంబంధిత బ్యాంకు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అందులో 'దయచేసి మీ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అయిన రూ.9 వేల కోట్ల సొమ్మును వాడకండి. అవి పొరపాటున మీకు బదిలీ అయ్యాయి' అని బ్యాంక్ అధికారులు చెప్పారు. తాను రూ.21వేలను వాడుకున్నానని బ్యాంకు సిబ్బందికి రాజ్‌కుమార్ తెలిపాడు. దీంతో బ్యాంకు మేనేజ్మెంట్.. వినియోగించిన డబ్బును తిరిగి చెల్లించాల్సిందిగా రాజ్‌కుమార్‌ను కోరారు. లేదంటే చర్యలు తీసుకుంటామని అతడిని బెదిరించే ప్రయత్నం చేశారు. దీంతో వెంటనే రాజ్‌కుమార్ దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సదరు బ్యాంకు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేశాడు. రాజ్‌కుమార్ కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇరు వర్గాల న్యాయవాదులను పిలిపించి రాజీ కుదిరించారు.