Tamil Nadu Youth Joins Ukrainian Army: భారత సైన్యంలో చేరేందుకు రెండు సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. కానీ, ఇప్పుడు ఉక్రెయిన్ తరఫున ఆ దేశ సైన్యంలో చేరి రష్యాతో పోరాటం చేస్తున్నాడు. అతనే తమిళనాడు, కోయంబత్తూర్‌కు చెందిన 21ఏళ్ల సైనికేశ్ రవిచంద్రన్. తుడలియుర్కు చెందిన సైనికేశ్ రవిచంద్రన్.. ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నేషనల్ వర్సిటీలో ఎయిరోస్పేస్ ఇంజినీరింగ్ విద్యార్థి. ప్రస్తుతం అతను ఉక్రెయిన్ ఆర్మీలో చేరినట్లు నిఘా విభాగాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలిసింది.
ఉక్రెయిన్ సైన్యంలో చేరిన క్రమంలో సైనికేశ్ ఇంటిని కొద్ది రోజుల క్రితం కేంద్ర నిఘా విభాగం అధికారులు సందర్శించారు. అతని గురించి, ఉక్రెయిన్ సైన్యంలో చేరేందుకు గల కారణాలను తెలుసుకున్నట్లు తమిళనాడు పోలీసులు తెలిపారు. సైనికేశ్‌కు.. ఆర్మీలో చేరాలని, ట్రైనింగ్‌లో పాల్గొనాలనేది కల అని అతని తల్లిదండ్రులు అధికారులకు తెలిపారు. అతని గదిలో భారత సైన్యం, అధికారుల చిత్రాలు అంటించి ఉండటాన్ని చూపించారు.
అమెరికా సైన్యం వివరాల సేకరణ..
అమెరికా సైన్యంలో చేరాలని చెన్నైలోని అగ్రరాజ్య కాన్సులేట్‌లోనూ వివరాలు సేకరించినట్లు సైనికేశ్ కుటుంబ సభ్యులు చెప్పటం గమనార్హం. అయితే, అది సాధ్యం కాదని తెలుసుకున్న సైనికేశ్ విరమించుకున్నాడు. ఐదేళ్ల ఎయిరోస్పేస్ ఇంజినీరింగ్ చేసేందుకు ఉక్రెయిన్ వెళ్లాడు. తనకు వీడియో గేమింగ్ సంస్థలో ఉద్యోగం లభించిందని ఇటీవలే కుటుంబ సభ్యులకు తెలిపాడు సైనికేశ్. కానీ, అతను ఉక్రెయిన్ సైన్యంలో చేరినట్లు అధికారులు ఇంటికి వచ్చాకే కుటుంబ సభ్యులకు తెలిసింది.
ఈ విషయం తెలిసి ఆందోళనకు గురయ్యానని, తన కుమారుడిని స్వదేశానికి తీసుకురావాలని సైనికేశ్ తండ్రి రవిచంద్రన్ కోరారు. తాను క్షేమంగానే ఉన్నానని, ఇంటికి రావాలనుకోవట్లేదని కొద్ది రోజుల క్రితమే చెప్పాడని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం వలంటీర్లు ఉన్న జార్జియన్ నేషనల్ లిజియన్ పారామిలటరీ యూనిట్లో సైనికేశ్ చేరి యుద్ధ భూమిలో పోరాటం చేస్తున్నట్లు తెలిసింది.
ఇదీ చూడండి:నీరే అగ్గి రాజేసింది.. ఉక్రెయిన్‌తో రష్యా వివాదానికి కారణం ఇదేనా!