Tamil Nadu Rains Today : దక్షిణ తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోత వర్షంతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమై జనజీవనం అస్తవ్యస్తమైంది. ఫలితంగా దాదాపు 800 మంది ప్రయాణికులు తూతుకూడిలోని ఓ రైల్వేస్టేషన్‌లో చిక్కుకుపోయారు. తిరుచెందూర్ నుంచి చెన్నైకు బయలుదేరిన ఎక్స్ప్రెస్ రైలు అనేక గంటలుగా శ్రీవైకుంఠంలోని నిలిచిపోయినట్లు అధికారులు వివరించారు. వీరిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
"శ్రీ వైకుంఠంలోని రైల్వే స్టేషన్ చుట్టూ నీరు చేరింది. రైలు పట్టాలు దెబ్బతినడం వల్ల రైళ్లు రాకపోకలు సాగించే పరిస్థితి లేకపోయింది. దాంతో ప్రయాణికులు స్టేషన్‌లోనే చిక్కుకుపోయారు. ఆ స్టేషన్‌కు వెళ్లే రహదారి కూడా దెబ్బతినడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. NDRF వారి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. హెలికాప్టర్ల ద్వారా వారికి ఆహారం అందించేందుకు ప్రయత్నిస్తున్నాం" అని దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో చెప్పింది.
కొండచరియలు విరిగిపడి భారీగా ట్రాఫిక్ జామ్
భారీ వర్షాల కారణంగా పాపనాశం, పెరుంజని, పెచుపారై డ్యాముల నుంచి నీటిని వదలడం వల్ల తిరునెల్వేలి, తూతూకుడి, తెన్కాసి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా వరద చేరింది. తిరునల్వేలి జిల్లాలో వరద ముప్పుతో అనేక మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. భారీ వర్షాలకు పశ్చిమ కనుమల్లోని కొండచరియలు విరిగిపడి తమిళనాడు, కేరళ రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ దెబ్బతింది. కొండచరియలు విరిగిపడడం వల్ల రెండు రాష్ట్రాలను కలిపే బొడి మెట్టు రోడ్డును అధికారులు మూసివేశారు. వాహనాలను అనుమతించకపోవడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొండచరియలను తొలగించే పనులు చేపట్టామని, పూర్తైన తర్వాతే వాహనాలను అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం భారీస్థాయిలో ఎన్డీఆర్ఎఫ్, పోలీసు బలగాలను మోహరించింది ప్రభుత్వం. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది.
ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోరిన సీఎం స్టాలిన్
Tamilnadu Rains 2023 : తమిళనాడును భారీ వర్షాలు కుదిపేస్తున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు ముఖ్యమంత్రి స్టాలిన్. ఈ నెల 19న (మంగళవారం) కలిసి రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు, వరదల పరిస్థితిపై చర్చించేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని మోదీని విజ్ఞప్తి చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన చెన్నైతో పాటు పరిసర జిల్లాల్లో సహాయక చర్యలకు కేంద్రం నుంచి త్వరగా నిధులు మంజూరు చేయాలని మోదీని కోరనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సహాయక చర్యలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడానికి సిద్ధంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లను స్టాలిన్ ఆదేశించారు. ఈ నెల ప్రారంభంలో మిగ్‌జాం తుపాను ప్రభావంతో తమిళనాడు ఉక్కిరిబిక్కిరైంది. దాని బీభత్సం నుంచి కోలుకుంటున్న సమయంలో మళ్లీ భారీ వర్షాలు తమిళనాడును అతలాకుతలం చేస్తున్నాయి.
తమిళనాడుపై వరుణుడి ప్రకోపం- నీటమునిగిన ఇళ్లు, పొలాలు- ప్రభుత్వం అలర్ట్
వరద నీటిలోనే చెన్నై సిటీ- రాజ్నాథ్ ఏరియల్ సర్వే- కేంద్రం రూ.450కోట్ల సాయం!