తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో.. అక్కడ ఉంగరాల వ్యాపారం జోరుగా సాగుతోంది. రాజకీయ పార్టీ, సంబంధిత నేతలపై అభిమానంతో పలువురు వీటిని ప్రత్యేకంగా తయారు చేయించుకుంటున్నారు. అలా ఒకరికొకరు పోటీపడి రింగులను ధరించి తమ రాజకీయ నేతలు, పార్టీల పట్ల అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇంతకీ ఆ ఉంగరాలేంటి? ఎన్నికలకు వాటితో సంబంధమేంటో ఓసారి చూద్దాం..
కోయంబత్తూర్‌లోని ఓ జ్యువెల్లరీ షాప్ ఈ రకం ఉంగరాలను తయారు చేస్తుండగా.. వాటికి అమితంగా ఆకర్షితులవుతున్నారు ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు, అభిమానులు. తమిళ దిగ్గజ రాజకీయ నాయకుల చిత్రాలు, పార్టీ గుర్తులతో వాటిని రూపొందించడమే ఇందులో ప్రత్యేకత. ఇలా ఏ పార్టీకి చెందిన రింగునైనా ఆర్డర్ ఇస్తే చాలు.. వారికి కావలిసిన డిజైన్‌లో తయారుచేసి ఇస్తున్నారు షాప్ నిర్వహకులు. ఇలా ఉంగరాలకు అమాంతం డిమాండ్ పెరిగిపోయి.. హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.
ప్రముఖ నాయకుల చిత్రాలతో..
ఎన్నికల ప్రచారాల్లో భాగంగా.. తాము మద్దతు తెలిపే పార్టీకి చెందిన జెండాలు, ఆ జెండాతో కూడిన అంచు ధోతీలు, శాలువాలు వేస్కోవడం, జేబులకు వారి ఫొటోలను పెట్టుకుని తిరగడం వంటివి కనిపిస్తుంటాయి. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సెంటిమెంట్‌ను పాటిస్తారు. అలాగే తమిళులు కూడా తమకు అదృష్టం వరించాలనే భావనతో ఇలా ఉంగరాలను ధరిస్తున్నారట. పంచలోహం(పసిడి, వెండి, రాగి, ఇత్తడి, సీసం)తో తయారైన ఈ రింగుల్లో అభిమాన నాయకుల చిత్రాలు ఉండటం వల్ల ఇవి అమితంగా ఆకట్టుకుంటున్నాయి. వాటిలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు ఎంజీ రామచంద్రన్, జే. జయలలిత, ఎం.కరుణానిధి సహా.. ప్రస్తుత నాయకులు కే.పళనిస్వామి(ముఖ్యమంత్రి), ప్రతిపక్ష నాయకులు ఎంకే.స్టాలిన్, కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ వంటి ప్రముఖుల చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
కొత్త ముఖాలతోనూ..
ఈ జాబితాలో సూపర్ స్టార్ రజనీకాంత్, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్, ఉదయనిధి స్టాలిన్, డీఎంకే యువ కార్యదర్శికి చెందిన కొత్త ముఖాలూ దర్శనమిచ్చాయి. అయితే.. మునుపెన్నడూలేని విధంగా ఈ ఉంగరాలకు ఈసారి భారీగా డిమాండ్ పెరిగిందని కోయంబత్తూర్ టౌన్‌హాల్- ఈచనారీలోని 'సార్వం' జ్యువెలరీ షాప్ యజమాని బద్రీ నారాయణన్ అన్నారు.
"అన్ని పార్టీల వైపు నుంచి కొనుగోలుదారులు ఆసక్తి కనబరుస్తున్నందున.. పలు సైజుల్లో రకరకాల రింగులను సిద్ధంచేసి ఉంచుతున్నాం. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దుకాణంలో కూలీలు తగ్గిపోయారు. అయినప్పటికీ ఉన్నవాళ్లతోనే ఎక్కువ సమయం పనిచేయిస్తూ.. అవసరానికి అందించే ప్రయత్నం చేస్తున్నాం. కొద్దిరోజులుగా.. రోజుకు 50-60 ఉంగరాలను ఉత్పత్తి చేస్తున్నాం."
- బద్రీ నారాయణన్, జ్యువెలరీ షాప్ యజమాని
లాక్డౌన్ కాలంలో ఏర్పడిన నష్టాలను.. ఇలా అధిక సమయం పనిచేసి అధిగమించే ప్రయత్నం చేస్తున్నామని అక్కడి కార్మికులు చెప్పుకొచ్చారు. ఒక్కో ఉంగరం తయారీకి 6 గంటల సమయం పడుతోందని వారు తెలిపారు.
ఇదీ చదవండి: అత్త కోసం గుడి కట్టిన 11 మంది కోడళ్లు