తమిళనాడులో దశాబ్ద కాలం వేచి చూసిన విజయం డీఎంకే సొంతమైంది. రెండు దఫాలుగా అధికారాన్ని దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలని భావించిన అన్నాడీఎంకే ఆశలపై నీళ్లు కుమ్మరించింది. డీఎంకేకు పెద్దదిక్కైన కలైంజ్ఞర్ కరుణానిధి లేకుండా ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లో పార్టీకి ఘనవిజయం సాధించి పెట్టిన అధ్యక్షుడు స్టాలిన్ విజయ సారథిగా అవతరించారు. కాంగ్రెస్ సహా పలు పార్టీలతో జట్టుకట్టి సమష్టిగా విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐ-ప్యాక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని పకడ్బందీ ప్రణాళికలతో స్టాలిన్ ఎన్నికల బరిలోకి దిగారు. పార్టీ ఎన్నికల ప్రణాళిక(మేనిఫెస్టో) ద్వారా ఓటర్లను ప్రభావితం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాదిరిగానే ఈ ఎన్నికల్లో మరపురాని విజయాన్ని సాధించారు.
పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే ఈ ఎన్నికల్లో గెలిచేందుకు చాలా ముందుగానే రూపొందించిన ప్రణాళికల ప్రకారం తమిళులకు చేరువైంది. ఓటర్లను ఆకర్షించేలా స్టాలిన్ ప్రసంగ వ్యూహాలను తీర్చిదిద్దడం, మేనిఫెస్టోలో జనరంజక హామీలు ఇవ్వడం, అభ్యర్థుల ఎంపిక, ఇతర అంశాల్లో పీకే బృంద ప్రభావం కనిపించింది. డీఎంకే 180 పైబడిన స్థానాల్లో పోటీ చేయాలనే ఐ-ప్యాక్ వ్యూహాన్ని స్టాలిన్ పక్కాగా అమలు చేశారు. కొన్ని కూటమి పార్టీల అభ్యర్థులను తమ పార్టీ ఎన్నికల గుర్తు ‘ఉదయ సూర్యుడు’తో పోటీ చేయించడం ద్వారా మొత్తం 188 స్థానాల్లో డీఎంకే పోటీ చేసేలా చూసుకున్నారు.
ఆకర్షించిన 505 హామీలు
505 అంశాలతో డీఎంకే విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో ఓటర్లను ఆకర్షించిందనే చెప్పాలి. అందులో.. రేషన్ కార్డుదారులకు రూ.4వేలు చొప్పున కరోనా సాయం, లీటరు పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.4 తగ్గింపు, వంటగ్యాస్ సిలిండర్‌కు రూ.100 రాయితీ, నీట్ పరీక్షలు రద్దు తదితర హామీల ప్రచారం ఓటర్లను ప్రభావితం చేశాయి. హిందూ వ్యతిరేక ముద్రను తొలగించుకోవడానికి డీఎంకే ప్రయత్నించింది. మేనిఫెస్టోలో హిందూ దేవాలయాల పునరుద్ధరణకు రూ.వెయ్యి కోట్లు ప్రకటించింది. ఎన్నికల ప్రచారాలను ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్న తిరువణ్ణామలై, మదురై, తిరుచ్చి తదితర ప్రాంతాల నుంచి స్టాలిన్ ప్రారంభించారు. ఆయన సతీమణి దుర్గ డీఎంకే కూటమి గెలుపు కోసం రాష్ట్రంలోని పలు ఆలయాలను సందర్శించి పూజలు చేశారు.
శూలాన్ని చేతపట్టి...!
అన్నాడీఎంకేను నిరాకరిద్దాం అనే నినాదంతో తిరుత్తణి (సుబ్రహ్మణ్యస్వామి ప్రసిద్ధ ఆరు పుణ్యక్షేత్రాల్లో ఒకటి)లో నిర్వహించిన కార్యక్రమంలో స్టాలిన్‌కు ఏకంగా సుబ్రహ్మణ్యస్వామి ఆయుధమైన శూలాన్ని కార్యకర్తలు బహుకరించారు. దానితో ఆయన ఫొటోలకు పోజులిచ్చి హిందువులకు డీఎంకే వ్యతిరేకం కాదనే సంకేతాలు పంపారు. ఈ నినాదాన్నే ఆయన తన ఎన్నికల ప్రచారంలో తరచూ వినిపించారు. భాజపా చేపట్టిన ‘వేల్‌యాత్ర’కు దీటైన సమాధానం ఇచ్చేలా ఈ వ్యూహం అమలు చేశారు. అన్నాడీఎంకే-భాజపా కూటమిపై తీవ్రస్థాయిలో ఆరోపణాస్త్రాలు సంధించారు. ఆ పార్టీలు తమిళులను, తమిళనాడు ప్రయోజనాలను విస్మరించాయని విమర్శించారు. నీట్, సాగుచట్టాలను, నూతన జాతీయ విద్యావిధానం వంటివాటిని కేంద్రంలోని భాజపా సర్కారు ప్రవేశపెట్టినా వాటిని రాష్ట్రంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం వ్యతిరేకించలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఒక్క అన్నాడీఎంకే అభ్యర్థి గెలిచినా భాజపాకు దాసోహమవుతారని, అందువల్ల భాజపాతో పాటు అన్నాడీఎంకే అభ్యర్థులను తిరస్కరించాలని కోరారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతిలోని రహస్యాన్ని బట్టబయలు చేస్తామని ప్రకటించారు. దీని ద్వారా ‘అమ్మ’ అభిమానుల మద్దతు పొందే ప్రయత్నం చేశారు.
ఇదీ చదవండి: