72 year old man body building: ఏడు పదుల వయసులో ఓ వ్యక్తి.. జిమ్‌లో బరువులతో కుస్తీలు పడుతున్నారు. యువకులకు ఏమాత్రం తగ్గకుండా కండలు పెంచుతున్నారు. అంతేకాదు.. అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. ఆయనే తమిళనాడు చెంగల్పట్టుకు చెందిన 72ఏళ్ల రతనం.
Tamil Nadu Rathinam body building: జిల్లాలోని మదురకంటకం ప్రాంతంలో నివసించే రతనం.. ఓ ఫిట్నెస్ ఫ్రీక్. యవ్వన దశలో ప్రారంభించిన కసరత్తులను ఇప్పటికీ క్రమం తప్పకుండా చేస్తూనే ఉన్నారు. చూస్తే 72 ఏళ్లు అంటే ఎవరికీ నమ్మశక్యం కానంతగా.. ఆయన శరీరాన్ని మలచుకొని మెయింటెన్ చేస్తున్నారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో మే 22న నిర్వహించిన బాడీబిల్డింగ్ పోటీలకు హాజరైన ఆయన.. ఇందులో ఉత్తమ ప్రదర్శన చేసి.. ఆసియా బాడీబిల్డింగ్, ఫిజిక్ స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్ పోటీలకు ఎంపికయ్యారు. 54వ ఆసియా బాడీబిల్డింగ్ పోటీల్లో 60 ఏళ్లు పైబడిన విభాగంలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం సంపాదించుకున్నారు. జులై 15 నుంచి 21 మధ్య మాల్దీవులులో ఈ పోటీలు జరగనున్నాయి.
ఈ సందర్భంగా ఈటీవీ భారత్‌తో మాట్లాడిన రతనం.. తమిళనాడు డీజీపీ శైలేంద్ర బాబు తనకు ఆదర్శమని తెలిపారు. ఫిజికల్ ఫిట్నెస్ గురించి సోషల్ మీడియాలో ఆయన ఇచ్చే సలహాలు తనకు ఎంతగానో నచ్చుతాయని వెల్లడించారు. అవకాశం వస్తే ఆయన్ను కలిసి శుభాకాంక్షలు అందుకోవాలని ఉందని చెప్పారు.
రతనం.. తాను ప్రాక్టీస్ చేయడమే కాక ఎంతో మందికి శిక్షణ కూడా ఇస్తున్నారు. తమ మాస్టర్ ఆసియా పోటీల్లో తప్పక విజయం సాధిస్తారని ఆయన స్టూడెంట్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడుతో పాటు దేశానికి ఆయన మంచిపేరు తీసుకొస్తారని చెబుతున్నారు.
మరోవైపు, తమిళనాడు పోలీస్ శాఖకు చెందిన స్టీఫెన్ జీఆర్ జోస్ అనే వ్యక్తి సైతం ఆసియా పోటీలకు ఎంపికయ్యారు. 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు విభాగంలో ఆయన పోటీ పడనున్నారు.
ఇదీ చదవండి: