Taj Mahal Snow Sculpture: విభిన్న భౌగోళిక పరిస్థితులు, ప్రకృతి రమణీయత కారణంగా పర్యటకులను ఏడాది పొడవునా ఆకర్షించే జమ్ముకశ్మీర్‌కు అక్కడి పర్యటకశాఖ జోడిస్తున్న అదనపు హంగులు మరింత ఆకట్టుకుంటున్నాయి. పర్యటకులు ఎంతో ఇష్టపడే గుల్మార్గ్‌లో ఇటీవలే అతిపెద్ద ఇగ్లూ కేఫ్‌ను నిర్మించడంతో సందర్శకుల సంఖ్య భారీగా పెరిగింది. తాజాగా ప్రేమికుల రోజును పురస్కరించుకుని నిర్మించిన మంచు తాజ్‌మహల్ యువ జంటలనే కాదు.. అన్ని వయసుల వారి మదిని దోచుకుంటోంది.
ప్రేమికుల రోజు ఆగ్రాలోని తాజ్‌మహల్ వద్ద భారీ సంఖ్యలో ప్రేమజంటలు సరదాగా గడిపిన సమయంలోనే గుల్మార్గ్‌లోనూ పర్యటకులు మంచు తాజ్‌మహల్ వద్ద సందడి చేశారు. శీతాకాలం కారణంగా గుల్మార్గ్‌లో భారీగా మంచు కురుస్తోంది. అలా కురిసిన మంచు అడుగులమేర రోడ్లు, ఇళ్లు, భవనాలపై పేరుకుపోతోంది. ఆ హిమంతో 16 అడుగుల పొడవు, 24 అడుగుల విస్తీర్ణంలో గ్రాండ్ ముంతాజ్ హోటల్ నిర్వహకులు మంచు తాజ్‌మహల్‌ను నిర్మించారు. యూసఫ్ బాబా అనే వ్యక్తి నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందం మంచు తాజ్‌మహల్‌కు రూపమిచ్చింది. ఎలాంటి ఖర్చు లేకుండానే ఈ ప్రేమ చిహ్నాన్ని నిర్మించారు. మొత్తంగా 17 రోజులు శ్రమించి.. ఈ మంచు తాజ్‌మహల్ నిర్మించారు.
క్యూ కడుతున్న పర్యటకులు..
ఇగ్లూ కేఫ్‌ను సందర్శించేందుకు దేశం నలుమూలల నుంచి ఇప్పటికే గుల్మార్గ్కు భారీ సంఖ్యలో పర్యటకులు క్యూకడుతున్నారు. వారంతా మంచు తాజ్‌మహల్ చూసి మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాని ముందు నిల్చొని ఫొటోలు తీసుకుంటున్నారు. తాము ఊహించనదానికంటే గుల్మార్గ్ ఎంతో అందంగా ఉందని వివిధ రాష్ట్రాల పర్యటకులు చెబుతున్నారు.
తమ వినియోగదారులకు చిరకాలం గుర్తుండిపోయే అనుభూతులను పంచేందుకు ఈ మంచు తాజ్‌మహల్‌ను నిర్మించినట్లు గ్రాండ్ ముంతాజ్ హోటల్ మేనేజర్ సత్యజిత్ గోపాల్ వెల్లడించారు.
ఇవీ చూడండి: చెట్టు కింద పులి.. కొమ్మలపై ఇద్దరు యువకులు.. గంటలపాటు సస్పెన్స్!
వయసు 60+.. 14 మందికి భర్త.. 7 రాష్ట్రాలకు అల్లుడు.. చివరకు..